పొద్దున్నే ముఖం కడుక్కోవాలంటే ఊరికి దూరంగా ఉన్న చెరువు దగ్గరికి పరుగెత్తాలి. బిందెడు నీళ్లు కావాలంటే ఊరి మధ్యలో ఉన్న తరాల నాటి చేతిపంపు ముందు వంతు వచ్చేవరకు వరుసలో నిల్చోవాలి. మొబైల్కు చార్జింగ్ పెట్టుకోవాలంటే పక్క రాష్ట్ర సరిహద్దులోని గ్రామానికి పరుగెత్తాలి. ఈ పరిస్థితి ఎక్కడో అడవుల్లోని ఆదివాసీ గూడేల్లో కాదు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సొంత ప్రాంతం కర్ణాటకలోని కలబురగి జిల్లాలోని గ్రామాల దుస్థితి ఇది.
అన్నట్టు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్న విషయం తెలుసుకదా! నాలుగు నెలల క్రితం వరకు ఈ గ్రామాల్లో తాగు నీరు తెచ్చుకొనేందుకు కాసేపైనా బోర్లు పోసేవి. కాంగ్రెస్ ఉచిత కరెంటు ఇస్తామని చెప్పగానే ప్రజలు ఓట్లేసి గెలిపించారు. అంతే.. వారి పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది. ఫోన్లు చార్జింగ్ పెట్టుకోవటానికి కూడా తెలంగాణ పల్లెలకు పరుగెత్తాల్సిన దుస్థితి ఏర్పడింది. కానీ, మల్లికార్జున ఖర్గే మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ రాజ్యం స్థాపిస్తామంటూ ఎన్నికల ప్రచారానికొస్తున్నారు. అవును మరి.. కాంగ్రెస్ రాజ్యం అంటే కర్ణాటకలాగే ఉంటది..
కర్ణాటక నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వెల్జాల చంద్రశేఖర్: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చుక్కలు చూపిస్తున్నది. ఆ పార్టీ ఇచ్చిన ఐదు గ్యారెంటీలను నమ్మి ప్రజలు ఆగమైపోయారు. ఇప్పుడు ఎవరిని కదిలించినా కాంగ్రెస్ను గెలిపించి తప్పు చేశామని బాధపడుతున్నారు. గ్యారెంటీల మాట దేవుడెరుగు.. గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకటం లేదని వాపోతున్నారు. కరెంటు లేక మోటర్లు పడావుపడి నరకయాతన అనుభవిస్తున్నామని చెప్తున్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ప్రకటించిన నేపథ్యంలో.. ఆ పార్టీ కర్ణాటకలో ఇచ్చిన ఐదు గ్యారెంటీలు ఎలా అమలవుతున్నాయో పరిశీలించేందుకు ‘నమస్తే తెలంగాణ’ పలు గ్రామాల్లో పర్యటించింది.
తెలంగాణ సరిహద్దుల్లో ఉండే పలు గ్రామాల ప్రజలను పలుకరించగా.. వారు తమ కష్టాలను ఏకరువు పెట్టారు. పగటి పూట అసలు కరెంట్ ఉండటం లేదని, రాత్రిపూట ఎప్పుడు వస్తుందో, ఎంతసేపు ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. నల్లాలో నీళ్లు వస్తాయన్న మాటే మరిచిపోయామంటున్నారు. ఎప్పుడో తాతల నాడు గ్రామాల్లో వేసిన చేతిపంపులను మళ్లీ బాగుచేయించుకొని మంచినీటి కోసం వాడుకొంటున్నారు. అవి కూడా ఊరికి ఒకటి రెండు మాత్రమే ఉండటంతో నీళ్లు పట్టుకొనేందుకు గంటలకు గంటలు వరుసలో నిలబడాల్సి వస్తున్నదని చెప్తున్నారు. ఆ బోర్లు కూడా అడుగంటడంతో నీళ్ల కోసం రెక్కలు అరిగిలా కష్టపడితే కానీ బిందెడు నీళ్లు రావటంలేదని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా అందరూ ఆ చేతి పంపుల వద్దనే నీటి కోసం పడిగాపులు పడుతున్నారు.
కర్ణాటక కరెంటు.. అంతా మాయ
కర్ణాటక పల్లెల్లో కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉన్నది. ఏ అర్ధరాత్రో కరెంట్ వచ్చినా సింగిల్ ఫేజ్ మాత్రమే వదులుతున్నారు. దీంతో మోటర్లు పని చేయడం లేదు. లో ఓల్టేజీ వల్ల ఇంట్లో ఉండే బల్బులు కూడా గుడ్డి దీపాల్లా మినుకుమినుకు మంటుంటే, ఇక మోటర్లు ఎక్కడ పనిచేస్తాయని సేడం తాలుకా గోపనపల్లి గ్రామస్థుడు భీంసేనప్ప వాపోయారు. అదే గ్రామానికి చెందిన వృద్ధురాలు హలిమా మాట్లాడుతూ, ‘నల్లా నీళ్లు మాటే మరిచిపోయాం. కరెంట్ సరిగా రాక, వచ్చినా డిమ్ కరెంట్ వల్ల(లో ఓల్టేజీ) నల్లా నీళ్లు చిన్న పిల్లాడు మూత్రం పోసినట్టు వస్తున్నాయి. గంటకి కూడా బిందె నిండదు’ అని వివరించారు.
ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి ఉన్న కరెంట్ కూడా పీకేశారని గోపనపల్లికి చెందిన అమృతప్ప అవేదన వ్యక్తంచేశారు. ‘ఊర్లో ఉన్న ఒకేఒక్క చేతిపంపు వద్ద తాగేందుకు రెండు బిందెల నీళ్లు తెచ్చుకొంటున్నాం. ఇంట్లో వాడుకకు చెరువు నుంచి తెచ్చుకొంటున్నాం’ అని తెలిపారు. ‘ఉచిత కరెంట్ లేకున్నా పాయే, కనీసం తాగే నీళ్లకన్నా కరెంట్ ఇస్తే బాగుండు’ అని నర్పమ్మ వాపోయారు. మా పిల్లలు సైకిళ్లకు బిందెలు కట్టుకొని దగ్గర్లోని తెలంగాణ పల్లెలకు వెళ్లి మంచి నీళ్లు తెచ్చుకుంటున్నారని తెలంగాణ సరిహద్దులోని రిబ్బనపల్లికి చెందిన యాడికే భీమమ్మ వివరించారు.
నీటి సమస్యతో అల్లాడుతున్నాం
కలబురిగి (గుల్బర్గా) జిల్లా సేడం నియోజకవర్గ ఎమ్మెల్యేగా కాంగ్రెస్కు చెందిన శ్రవణ ప్రకాశ్ పాటిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన ప్రసుత్తం రాష్ట్ర మంత్రిగా కూడా ఉన్నారు. ఇదే తాలుకాలోని గోపనపల్లి గ్రామ జనాభా మూడు వందలు ఉంటుంది. నెలన్నరగా విద్యుత్తు సరిగా రాక మంచి నీటి సమస్యతో అల్లాడిపోతున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోయారు. పగలు కరెంట్ లేకపోవటంతో తాతల కాలంలో వేసిన చేతి పంపే దిక్కయిందని చెప్పారు.
తెలంగాణలో ఉన్నట్టు మా దగ్గర లేదు
తెలంగాణలో ఉన్నట్టు, అక్కడి ప్రజలకు అన్ని మౌలిక సౌకర్యాలు అందుతున్నట్టు తమ రాష్ట్రంలో లేదని రిబ్బనపల్లికి చెందిన సావిత్రమ్మ అనే యువతి తెలిపారు. మా అమ్మమ్మ వాళ్ల ఊరు తెలంగాణలోని కొడంగల్ దగ్గర కుదురుమల్ల అని వివరిస్తూ, ‘మాకు సీఎం కేసీఆర్ అన్ని ఇస్తున్నారు.. మీకు ఏమీ లేదని ఎక్కిరిస్తారు’ అంటూ వాపోయింది. ‘అక్కడ నీళ్లు ఒక్కటే కాదు రైతులకు రైతుబంధు, పేదోళ్ల పెండ్లిండ్లకు పైసలు కూడా ఇస్తరంట’ అని ఆశ్చర్యపోవడం విశేషం.