కరీంనగర్: బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ని నీది ఏ పార్టీ.. రాజీనామా చేసే దమ్ముందా? అంటూ నిలదీసిన ఘటనలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై (Padi Kaushik Reddy) మూడు కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్‌పై దురుసుగా ప్రవర్తించారని ఆయన పీఏ ఫిర్యాదు చేయడంతోపాటు సమావేశంలో గందరగోళం, పక్కదారి పట్టించారని ఆర్టీవో ఫిర్యాదు చేశారు. దీంతో కరీంనగర్‌లోని ఒకటో పట్టణ పోలీసులు వివిధ సెక్షన్ల కింద మూడు కేసులు నమోదుచేశారు. ఉమ్మడి కరీంగనర్ జిల్లా సమావేశం కరీంగనర్ కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా.. ‘నువ్వు ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నవో చెప్పు.. పార్టీ మారిన నీకు మాట్లాడేహక్కు లేదు.. రాజీనామా చేసే దమ్ముందా?’ అంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నిలదీశారు. ‘నువ్వు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన స్వార్థపరుడివి. నీకు ఇక్కడ మాట్లాడే అర్హత లేదు. ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నవో చెప్పాలి? అంటూ ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఒకరినొకరు నెట్టుకుంటూ దూషించుకున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీహెచ్ విజయరమణారావు, ఆది శ్రీనివాస్, డాక్డర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మక్కాన్‌సింగ్ ఠాకూర్ తదితరులు కౌశిక్‌రెడ్డిని అడ్డుకున్నారు. ఆయనను వేదికపై నుంచి కిందికి నెట్టే ప్రయత్నం చేశారు. దీంతో వేదికపైనే ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకుని కౌశిక్‌రెడ్డిని బలవంతంగా కలెక్టరేట్ ఆడిటోరియం నుంచి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో కౌశిక్‌రెడ్డి తుల్లి వేదికపై ఉన్న కుర్చీలో పడిపోయారు. పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లి ఆడిటోరియం బయట వదిలేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, కౌశిక్‌రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే సంజయ్.. పాడి కౌశిక్‌రెడ్డి ఛాతీపై చేయి వేసి నెట్టేశారు.
కేసీఆర్ పెట్టిన భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు దమ్ముంటే రాజీనామా చేసి, కాంగ్రెస్ బీఫాంపై పోటీ చేసి గెలవాలని పాడి కౌశిక్‌రెడ్డి సవాలు చేశారు. తనపై కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యం చేస్తున్నదని మండిపడ్డారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేనైన తనను మంత్రుల సాక్షిగా కరీంనగర్ సమీక్షా సమావేశం నుంచి బయటకు లాక్కొచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి, అమ్ముడుపోయిన జగిత్యాల ఎమ్మెల్యేను
‘నీది ఏ పార్టీ?’అని అడిగితే.. ‘కాంగ్రెస్ పార్టీ’ అని చెప్తున్నాడని, అతనిపై స్పీకర్ అనర్హత వేటు వేయాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను విమర్శిస్తుంటే తాము చూస్తూ ఊరుకోలేమని స్పష్టంచేశారు. ఇలాంటి వారిని నిలదీస్తామని, అడుగడుగునా అడ్డుకుంటామని చెప్పారు. మూడేండ్ల తర్వాత మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని, ఇప్పుడు అతిగా ప్రవర్తిస్తున్న ప్రతి ఒక్కరిపై చర్యలు తప్పవని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిన ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. సంజయ్ రాజీనామా చేసే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని స్పష్టంచేశారు.