ఇటీవల సైబర్ మోసాలకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హానీ ట్రాప్, న్యూడ్ వీడియో కాల్స్‌తో బెదిరించడం ఎక్కువయ్యాయి. సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ సైబర్ మోసాల బారిన పడుతున్నారు. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు కూడా ఇలాగే న్యూడ్ వీడియో కాల్ వచ్చింది. అర్ధరాత్రి సమయంలో వచ్చిన ఈ కాల్‌తో ఉలిక్కిపడ్డ సదరు ఎమ్మెల్యే .. పోలీసులు, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు చేయడంతో ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఈ నెల 14వ తేదీన అర్ధరాత్రి సమయంలో ఓ వీడియో కాల్ వచ్చింది. తెలియని నంబర్ నుంచి ఆ కాల్ వచ్చింది. ప్రజాప్రతినిధి కావడంతో ఎవరైనా అవసరం కోసం ఫోన్ చేసి ఉంటారని భావించి కాల్ ఆన్సర్ చేశారు. కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే స్క్రీన్‌పై షాకింగ్ దృశ్యం కనిపించింది. ఓ అమ్మాయి నగ్నంగా కనిపించడంతో సదరు ఎమ్మెల్యే షాకయ్యారు. వెంటనే కాల్ కట్ చేశారు.
ఈ వీడియో కాల్ గురించి ఈ నెల 17వ తేదీన హైదరాబాద్‌లోని సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో సదరు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఫిర్యాదులో ఎమ్మెల్యే పేర్కొన్న నంబర్ ఎవరిదని కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, నిజంగానే ఇది సైబర్ నేరస్తుల పనేనా? లేదా ఎవరైనా తనపై కుట్ర పన్నేందుకు ఇలా చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.