Dalit Bandhu | Huzurabad | దళిత బంధు పథకాన్ని ఎవరికీ మంజూరు చేయలేదని, బయట వస్తున్న పుకార్లు నమ్మవద్దని కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం కింద లబ్ధిదారుల ఎంపిక సర్వే పూర్తయిందని చెప్పారు. అయితే ఇంతవరకు ఏ ఒక్కరికీ ఇంకా మంజూరు చేయలేదని స్పష్టం చేశారు. ఈ నెల 16న హుజురాబాద్‌లో దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభిస్తారని, అనంతరం ప్రతి ఒక్కరికీ దళితబంధును మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఐదు మండలాల్లోని గ్రామాల్లో ప్రత్యేకాధికారులు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు అన్ని అర్హతలను పరిగణలోకి తీసకొని లబ్ధిదారులను ఎంపిక చేస్తాయని అన్నారు. లబ్ధిదారులెవరూ ఆందోళన చెందవద్దని, బయట వస్తున్న ఏ పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా, సీఎం కేసీఆర్ సోమవారం నాడు దళితబంధు పథకాన్ని ప్రారంభించనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్న నేపథ్యంలో, ఇందుకోసం హుజూరాబాద్‌లో భారీ వేదికను సిద్ధం చేస్తున్నారు. గురువారం నాడే ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు సభా ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించారు కూడా.