కరీంనగర్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): నదుల అనుసంధానం పేరిట తెలంగాణకు జీవనాధారమైన గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కరీంనగర్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ ధ్వజమెత్తారు. మంగళవారం కరీంనగర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నదుల అనుసంధానంపై దేశంలో ఎప్ప టి నుంచో చర్చ జరుగుతున్నదని, 2014లో ఈ విషయం తెరపైకి వచ్చినప్పుడు గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణ వాటా తేల్చాలని అప్పటి సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాయడంతో మరుగునపడిన విషయాన్ని వినోద్‌కుమార్ గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేంద్రంలోని బీజేపీ ఈ విషయాన్ని మరోసారి తెరపైకి తెచ్చిందని అన్నారు.
తమిళనాడులో రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తున్న బీజేపీ తెలంగాణకు దగా చేయాలని చూస్తున్నదని మండిపడ్డారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఎత్తును వంద మీటర్లు పెంచాలని నిర్ణయం తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎంవోయూ కుదిరినట్టు స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఈ నెల 15న కేంద్ర జలవనరుల శాఖ ఆదేశాలు కూడా ఇచ్చిందని అన్నారు. 1985లో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల మధ్య ఇచ్చంపల్లిలో మల్టీపర్పస్ ప్రాజెక్టు నిర్మించే ప్రయత్నాన్ని మహారాష్ట్రతోపాటు అప్పటి మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు. ఉత్తరాదిలో గంగా, మహానదుల అనుసంధానంలేకుండా గోదావరి, కావేరీ నదులను అనుసంధానం చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
నదుల అనుసంధానం కేవలం దక్షిణ భారత దేశానికే వర్తింపజేస్తారా? అని వినోద్‌కుమార్ ప్రశ్నించారు. గోదావరి బేసిన్‌లోని సమ్మక్క సాగర్‌కు 47, సీతారామ ప్రాజెక్టుకు 67, తమ్మిడిహెట్టికి 20 టీఎంసీలు ఇవ్వాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ తెరపైకి తెస్తున్న వార్దా ప్రాజెక్టు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ జలాలను తమిళనాడుకు తరలించే కుట్రలో భాగంగానే ఇచ్చంపల్లిని తెరపైకి తెస్తున్నారని స్పష్టం చేశారు. ఇంత జరుగుతున్నా ఇక్కడి బీజేపీ ఎంపీలు, నాయకులు ఎందుకు నోరుతెరవడం లేదని నిలదీశారు. మేడిగడ్డ వద్ద కాఫర్ డ్యాం నిర్మించాలని బీఆర్ఎస్ చెబుతున్నప్పటికీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని మండిపడ్డారు. నోరు తెరిస్తే ధర్మం గురించి మాట్లాడే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గోదావరి జలాల తరలింపును ఏ ధర్మం ప్రకారం సమర్థించుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని నలుగురు బీజేపీ ఎంపీలు ప్రధానితో మాట్లాడి గోదావరి, కావేరి నదుల అనుసంధానాన్ని రద్దు చేయించాలని కోరారు. ఈ సమావేశంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మేయర్ వై సునిల్ రావు, మాజీ ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు పాల్గొన్నారు.