కరీంనగర్ కార్పొరేషన్, మే 9: కరీంనగర్ జిల్లా కేంద్రంలో శనివారం బీఆర్ఎస్ చేపట్టిన నగర బంద్‌పై పోలీసుల నిర్బంధకాండ కొనసాగింది. బంద్ నిర్వహించేందుకు బీఆర్ఎస్ నాయకులు రోడ్లపై రాగా, దొరికిన వారిని దొరికినట్టే అరెస్ట్ చేశారు. నగర ప్రజలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. టవర్‌సర్కిల్, బస్టాండ్ ఏరియా, కోర్టు చౌరస్తా ఏరియా, మంచిర్యాల చౌరస్తా, తెలంగాణ చౌక్, కమాన్ చౌరస్తా ప్రాంతాల్లో వాణిజ్య, వ్యాపార వర్గాలు తమ షాపులను తెరువలేదు. ఉదయం నుంచే నగరంలోని అన్ని ప్రధాన చౌరస్తాల్లో పెద్ద ఎత్తున పోలీసుల బందోబస్తు కనిపించింది.
ఎమ్మెల్యే గృహనిర్బంధం.. అరెస్ట్
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను గృహ నిర్భంధంచేశారు. జిల్లా కేంద్రంలోని కమలాకర్ నివాసం వద్ద ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో బలగాలు మోహరించాయి. ఎమ్మెల్యే ఇంటికి తరలివస్తున్న కార్యకర్తలను లోపలికి అనుమతించకుండా, గంగుల తన నివాసం నుంచి బయటికి రాకుండా అడ్డుకున్నారు. గంగుల ఇంట్లో నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా అరెస్ట్ చేసి నగరంలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో యువకులు, నాయకులు బైక్ ర్యాలీగా వచ్చి గంగులకు మద్దతుగా నిలిచారు. నల్ల జెండాలతో బీజేపీ గుండాయిజానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. మాజీ మేయర్ రవీందర్‌సింగ్, ఇతర నాయకులను అరెస్ట్ చేశారు.
కరీంనగర్‌ను అల్లకల్లోలం చేస్తున్నారు: ఎమ్మెల్యే గంగుల కమలాకర్
ప్రశాంతంగా ఉన్న కరీంనగర్లో అలజడి సృష్టిస్తూ అల్లకల్లోలం చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. అరెస్ట్ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, విమర్శలు, ప్రతివిమర్శలు ఉంటాయని, కానీ కరీంనగర్లో కొత్త సంస్కృతిని తీసుకువస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం సరికాదన్నారు. ‘బండి సంజయ్ తెలిసి చేయించావా…? తెలియక చేయించావా చెప్పాలి’ అని ప్రశ్నించారు. వెంటనే ఆ కార్యకర్తలపై చర్యలు తీసుకుని, మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా చూసుకోవాలని సూచించారు.
కేంద్ర మంత్రిగా ఉన్న సంజయ్ చట్టాన్ని కాపాడుకోవాల్సింది పోయి ఇలా వ్యవహరించడం సరికాదని హితవుపలికారు. తమపై దాడి చేసిన వారిని గుర్తు పెట్టుకుంటామని హెచ్చరించారు. తనను అరెస్ట్ చేయడం కాదని, ఇటీవల నగరంలో బంగారం దోపిడీచేసి పారిపోయిన దొంగలను అరెస్ట్ చేయాలని సూచించారు. పోలీసుల నిఘా ఉంటే దోపిడీ జరిగే అవకాశం ఉండేది కాదన్నారు. ఏ తప్పు చేశానని గృహ నిర్బంధం చేశారో పోలీసులు చెప్పాలని నిలదీశారు. తమపై దాడులు జరుగడాన్ని డీసీసీ అధ్యక్షుడు స్వాగతిస్తున్నామని ప్రకటించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. బంద్ సక్సెస్ కావద్దని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కోరుకున్నా, ప్రజలు, వ్యాపార, వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయని తెలిపారు. భౌతిక దాడులు జరగవద్దని, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలనే నినాదంతో బంద్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అరెస్ట్‌కు నిరసనగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తాలో బండి సంజయ్ దిష్టిబొమ్మను ద హనం చేశారు. ‘బండి సంజయ్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పొన్నం అనిల్, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ మాట్లాడుతూ .. శాంతియుతంగా బంద్ చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా శాంతియుతంగా బంద్ చేస్తుంటే తమను అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. బంద్ సందర్భంగా మాజీ మేయర్ రవీందర్‌సింగ్ ఆధ్వర్యంలో నగరంలో బైక్ ర్యాలీ తీశారు.
ఎక్కడికక్కడ అరెస్ట్‌లు
టవర్‌సర్కిల్‌కు చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఉదయం నుంచే వచ్చినవారిని వచ్చినట్లుగానే నిర్భందించారు. కొందరు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు టవర్‌సర్కిల్‌లోని లేబర్ అడ్డాకు చేరుకోగా పోలీసులు అరెస్ట్ చేశారు. మార్కెట్ వెంకటేశ్వర దేవాలయం వద్ద ఉన్న నాయకులు, కార్యకర్తలను సైతం అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావును వారి సొంత గ్రామంలోనే గృహనిర్బంధం చేశారు. మాజీ కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, కుర్ర తిరుపతిని హౌస్అరెస్ట్ చేశారు. తెలంగాణచౌక్‌లో కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ, మానకొండూర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు.