హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన కన్నెపల్లి పంప్‌హౌస్ నీటి ఎత్తిపోతలకు సిద్ధమైంది. అసాధారణ వర్షాలతో గత జూలై 14న కన్నెపల్లి పంప్‌హౌస్ పూర్తిగా నీట మునిగిన విషయం తెలిసిందే. దీంతో పంప్‌హౌస్‌లో గల 17 మోటర్లు, కంట్రోల్ ప్యానళ్లు నీట మునిగాయి. కాళేశ్వరం పంప్‌లను సత్వరమే పునరుద్ధరించి యాసంగికి కచ్చితంగా నీరందిస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. ఆ హామీ మేరకు ఇప్పటికే అన్నారం పంప్‌హౌస్‌ను పునరుద్ధరించగా, తాజాగా కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సైతం సిద్ధం చేసింది. మోటర్ల టెస్ట్ రన్ పూర్తి చేసి ఆదివారం ప్రారంభించేందుకు సన్నద్ధమైంది. కన్నెపల్లి పంప్‌హౌస్‌లో ఒక్కొక్కటి 40 మెగావాట్ల సామర్థ్యం గల 17 మోటర్లు ఉండగా, ఈ నెలాఖరు నాటికి 11 పంపులను సిద్ధం చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే సేఫ్టీవాల్‌ను పునర్నిర్మించారు. మోటర్లు, ఎలక్ట్రిక్, ఎలక్ట్రికల్ పరికరాలను విప్పి ఏమాత్రం తేమ లేకుండా ఆరబెట్టే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించారు. అన్ని పంపులను టెస్ట్ రన్‌కు సిద్ధం చేశారు. వాటిలో తొలుతగా 6 పంపుల ద్వారా ఎత్తిపోతలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈఎన్సీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఆదివారం మోటర్ల వెట్న్‌న్రు ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వారం రోజుల్లో 6 పంపుల వెట్న్‌న్రు పూర్తి చేయాలని భావిస్తున్నారు.