నెట్వర్క్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరద ముప్పు తగ్గుముఖం పట్టిన తర్వాత కామారెడ్డి పట్టణంలోని కొంత భాగం శిథిల ప్రాంతంగా కనిపించింది. ఎక్కడిక్కడ కొట్టుకుపోయిన వాహనాలు, వేర్లతో కొట్టుకు వచ్చిన భారీ వృక్షాలు, తెగిన రహదారులు, రాళ్లు తేలిన అంతర్గత రోడ్లతో అధ్వానంగా మారింది. జీఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు ఏరియాల్లో ఎటు చూసినా సామాన్లు ఆరు బయట వేసుకుని సర్దుకుంటున్న పరిస్థితులు. ఇంట్లోకి చొచ్చుకొచ్చిన వరద వల్ల బురద పేరుకు పోవడంతో అడుగు తీసి అడుగు వేసే అవకాశమే లేకుండా పోయింది. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్లలోకి బురద చేరడంతో పనికిరాకుండా పోయాయి. వరదతో సర్వం కోల్పోయి ప్రాణాలతో బయట పడిన బాధిత కుటుంబాలకు చినుకు పడితే గజగజ వణికిపోయేంత పరిస్థితి ఏర్పడింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులను వెంటేసుకుని ఏరియల్ సర్వే నిర్వహించడంతో తమకు తక్షణ సాయం అందుతుందని కామారెడ్డి వరద బాధితులు భావించారు. గురువారం ఇన్చార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎస్పీ ఆఫీస్‌లో రివ్యూ చేశారు. మంత్రి సమీక్షలో వరదలో చనిపోయిన వారికి రూ.2లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు.
కామారెడ్డి జిల్లాలోని జాతీయ రహదారి 44పై శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సదాశివనగర్ నుంచి భిక్కనూర్ టోల్ ప్లాజా వరకు 18 కిలో మీటర్లకు పైగానే రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచి పోయాయి. నాలుగు వరుసల రహదారిలో క్యాసంపల్లి వద్ద ఓ వైపు పూర్తిగా రోడ్డు దెబ్బతిన్నది. దీంతో వన్‌వే పాటిస్తుండటంతో వాహనాల నియంత్రణ జరగడంలేదు.
కామారెడ్డి జీఆర్ కాలనీలో ఓ చార్టెడ్ అకౌంటెంట్ ఓ యూట్యూబ్ చానల్లో సీనియర్ ఐపీఎస్ అధికారికి ఫోన్ కలిపి తన బాధను వివరించే ప్రయత్నంచేయగా ఆ అధికారి తీవ్ర స్థాయిలో మందలిస్తూ.. నోరు మూసుకోండయ్యా… షటాప్ అంటూ ఫోన్ పెట్టేయడంతో బాధితుడు కంగుతిన్న పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియో ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్‌లలో వైరల్‌గా మారింది. బాధితుల నంబర్లను బ్లాక్ లిస్టులో పెట్టారంటూ పలువురు వరద బాధితులు మండిపడటం వీడియోలో కనిపించింది. భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజలు, రైతులను ఆదుకోవడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మండిపడ్డారు.