కల్వకుర్తి రూరల్, సెప్టెంబర్ 28 : అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో కొమ్ము శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతే స్థ్ధానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
బీసీలను కేవలం ఓటు బ్యాంకు కోసం వాడుకుంటున్నారని, వారు రాజకీయ సాధికారతతోనే అభివృద్ధి సాధించగలుగుతారని తెలిపారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తెలంగాణ చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డియేనని అన్నారు. రాబోయే కాలంలో బీసీలదే హవా కొనసాగనున్నదని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్ అమలు చేసేలా తాను కాంగ్రెస్ అధిష్ఠానంతో మాట్లాడుతానని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్‌గౌడ్, ఉప్పల వెంకటేశ్, జంగయ్య, రవికుమార్ ఉష, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.