Kalvakuntla Sanjay | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవినీతిని బయటపెడితే ప్రభుత్వం స్పందించడం లేదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వంకుట్ల సంజయ్ మండిపడ్డారు. మైనింగ్‌పై జరుగుతున్న అవినీతిపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. సభాసంఘం వేయాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిమాండ్ చేసిందని గుర్తుచేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కల్వకుంట్ల సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. నిజమైన నాయకులంటే పార్టీ లైన్లో ఉండాలి.. కానీ పార్టీ మారిన మనిషిని మీ భుజాల మీద ఎత్తుకుంటున్నారని మండిపడ్డారు..
తోటి శాసనసభ్యుడిని తిట్టేందుకు మంత్రులకు మైక్‌లు ఇచ్చారని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు ఒక్కరైనా సబ్జెక్ట్ మాట్లాడారా అని ప్రశ్నించారు. స్వర్ణకారుల కష్టాల గురించి ఒక్కరైనా మాట్లాడారా అని అడిగారు. అవినీతి మంత్రిని, పార్టీ మారిన వ్యక్తిని వెనుకేసుకొచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే మా వెనుకాల కూర్చోవాలి కదా అని ప్రశ్నించారు. కడియం శ్రీహరి వంటి నాయకుడి మీరు వెనుకేసుకొస్తారా అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడియం శ్రీహరి ఏ పార్టీ అని మేం తప్పకుండా అడుగుతామని తెలిపారు. తొలిసారి అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు రాజ్యాంగ విలువలు కాపాడాలని సూచించారు. అసెంబ్లీలో చర్చ చూసి పిల్లలు నవ్వుకుంటున్నారని అన్నారు. సభలో పాలసీల గురించి మాట్లాడుతున్నామా? అని అడిగారు. మనం చర్చించాల్సింది ప్రజల సమస్యల గురించి మాత్రమే అని స్పష్టం చేశారు.