హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : ధికారమే జీవితంగా గడిపిన కాళోజీ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. మంగళవారం పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో కాళోజీ సాహిత్యం ఎంతో స్ఫూర్తిని నింపిందని కొనియాడారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కాళోజీని సముచితంగా గౌరవించుకున్నామని తెలిపారు.
కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా అమలుచేసి, తెలంగాణ భాష, సాహిత్యంలో విశేషంగా కృషిచేసిన కవులు, రచయితలకు కాళోజీ పేరుతో పురసారాలను అందిస్తూ గౌరవించుకునే గొప్ప సంప్రదాయాన్ని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకొల్పిందని గుర్తుచేశారు. రాష్ట్ర వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరు పెట్టుకున్నామని, వరంగల్లో కాళోజీ కళాకేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. తన పుట్టుక నుంచి చావు దాకా జీవితమంతా తెలంగాణనే శ్వాసించిన కాళోజీ సాహిత్యం అన్నివేళలా ఆదర్శమని కేసీఆర్ కొనియాడారు.