హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ప్రాణేశ్వరం అయితే.. ప్రతిపక్షాలు శనేశ్వరంలా దాపురించాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో యాసంగిలో రైతులకు కావల్సినంత సాగునీరు ఇస్తామని, యాసంగి పంటను కొనుగోలు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉండాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పంపు హౌస్‌ల మరమ్మతులు పూర్తి కావస్తున్నాయనే వార్త తెలంగాణ రైతులకు, ప్రజలకు సంతోషకరమన్న హరీశ్‌రావు.. ప్రతిపక్షాలకు మాత్రం తన సంతాపమని ఎద్దేవా చేశారు. ఈ నెలలో అన్నారం, వచ్చే నెలాఖరు నాటికి మేడిగడ్డ పంపుహౌస్ మోటర్లు తిరిగి పని ప్రారంభిస్తాయని వెల్లడించారు. ఈ మరమ్మతులకు ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఖర్చు చేయడంలేదని, ఏజెన్సీ నిధులతోనే మరమ్మతు చేయిస్తున్నదని చెప్పారు. మంగళవారం శాసనమండలిలో రాష్ట్రంలో అతివృష్టి – గోదావరి పరీవాహక ప్రాంతంలో వరదలపై స్వల్పకాలిక చర్చకు మంత్రి హరీశ్‌రావు జవాబు చెప్తూ గోదావరి నదికి ఇంత పెద్ద ఎత్తున వరదలు వచ్చిన చరిత్ర గతంలో లేదన్నారు.
1986లో 107.09 మీటర్ల మేర 24 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినట్టు సీడబ్ల్యూసీ లెక్కలు చెప్తున్నాయని పేర్కొన్నారు. కాళేశ్వరం నిర్మాణ సమయంలో గత 500 ఏండ్లలో వచ్చిన వరద చరిత్రను చూసే డీపీఆర్ తయారు చేశామని వెల్లడించారు. గత జూలై 8-13 తేదీల మధ్యన 248 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, గత కొన్ని సంవత్సరాల సాధారణ వర్షపాతాన్ని చూస్తే.. జూలై 8 నుంచి జులై 13వ తేదీల్లో కేవలం 43 మిల్లీమీటర్లు వచ్చేదని, దీనికి ఐదు రెట్లు వర్షపాతం అధికంగా నమోదయిందని పేర్కొన్నారు. ఈ జూలైలో 108.2 మీటర్ల మేర 29 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని.. గతంలో కన్నా 1.2 మీటర్లు వరద ఎక్కువ రావడం వల్ల పంపులు మునిగాయని చెప్పారు.
ఏజెన్సీ నిధుల ద్వారానే మరమ్మతులు
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గ్రోత్ ఇంజిన్ అని.. సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలు తీరుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసించిన విషయాన్ని హరీశ్‌రావు గుర్తుచేశారు. కాళేశ్వరాన్ని చూసి చాలామంది అబ్బురపడ్డారని చెప్పారు. రాష్ర్టానికి మంచిపేరు రావడాన్ని జీర్ణించుకోలేని విపక్షాలు బురద రాజకీయం చేస్తున్నాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలూ తీసుకున్నదని చెప్పారు. ప్రాజెక్టుకు డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఉంటుందని, మరమ్మతులు ఏవి వచ్చినా.. ఏజెన్సీదే బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఇవ్వదని, మరమ్మతులన్నీ ఏజెన్సీ ద్వారానే చేయిస్తున్నామని స్పష్టంచేశారు. అన్నారం పంప్ హౌస్‌లో సెప్టెంబర్ మూడో వారంలో నీళ్లు పోయడం ప్రారంభమవుతుందని, మేడిగడ్డ పంపుహౌస్ అక్టోబర్ నెలాఖరులోగా నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభమవుతుందని ప్రకటించారు. నాలుగేండ్ల వరకు కాళేశ్వరం నీళ్ల రావని గోబెల్స్ ప్రచారం చేశారని, కానీ ఇదే నెలలో యాసంగికి నీరు ఇస్తామని హరీశ్ చెప్పారు. ఈ వార్త ప్రజలకు సంతోషమని, ప్రతిపక్షాలకు మాత్రం సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. ప్రతిపక్షాల ఆశలు, కలలు కల్లలయ్యాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రజలకు ప్రాణేశ్వరం.. తెలంగాణకు విపక్షాలు శనేశ్వరంలా దాపురించాయని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు రెండు లక్షల కోట్లు అయ్యేది
కాళేశ్వరం ద్వారా ఒక ఎకరానికి నీరు రాలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేయడాన్ని మంత్రి హరీశ్‌రావు తప్పుపట్టారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. తన నియోజకవర్గంలోకి నీళ్లు రావడానికి మల్లన్నసాగర్ దగ్గర గేటు ఎత్తి నీరు వదలి, పూలు జల్లి పూజ చేశారని, ఆ పార్టీ నేతలు మాత్రం ఒక ఎకరం పారలేదని మాట్లాడతారని విమర్శించారు. పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా వడ్ల సేకరణ చూస్తే 2014 -2015 లో 24.30 లక్షల మెట్రిక్ టన్నులు కొంటే, 2021-22లో 1.21 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామని గుర్తుచేశారు. భూగర్భ జలాలు 4.06 మీటర్లు పెరగటానికి 400 టీఎంసీల భూగర్భ జలాలు పెరగటమే కారణమని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడం వల్ల లక్ష కోట్లు ఆదా చేశామని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినపుడు రూ.38 వేలకు టన్ను ఉన్న స్టీల్ ఇప్పుడు రూ.60 వేలు అయిందని, ఆ రోజు డీజిల్ రూ.57 ఉంటే ఇప్పుడు రూ.100 అయిందని, సిమెంట్ బస్తా ధర డబుల్ అయిందని, స్టీల్ 113%, ఇంధన ఖర్చులు 78% పెరిగాయని, మొత్తంగా చూసుకుంటే వంద శాతం ఖర్చు పెరిగిందన్నారు. లక్ష కోట్లతో ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకొన్నామని, ఇవాళ ఈ ప్రాజెక్టు కట్టాలంటే రెండు లక్షల కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు. భూసేకరణ విషయంలోకూడా ఆనాడు ఎకరం రూ.ఐదారు లక్షలు ఉండేదని, ఇప్పుడు రూ.25 లక్షలకు తకువ లేదని తెలిపారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో పని చేయకుంటే లక్ష కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు పెరిగేదన్నారు. ఓ కేంద్ర మంత్రి వచ్చి ఎకువ వడ్డీకి రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకుంటున్నదని అన్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ‘తెలంగాణ ప్రభుత్వం వడ్డీ వ్యాపారుల వద్ద, ప్రైవేటు కంపెనీల వద్ద తీసుకున్నదా? కేంద్ర బ్యాంకుల వద్దే కదా తీసుకున్నది! మీ ప్రభుత్వరంగ సంస్థల దగ్గర తీసుకున్నాం. తెలంగాణపై అంత ప్రేమ ఉంటే వడ్డీ తగ్గించండి’ అంటూ హరీశ్‌రావు సూచించారు. డీపీఆర్ కంటే అతి తకువ కాస్ట్ ఎస్టిమేషన్‌తో పూర్తయిన ప్రాజెక్టు కాళేశ్వరమని, పోలవరం, నర్మద, ఎస్సారెస్పీ ఇలా ఏ ప్రాజెక్టు తీసుకున్నా ఐదు నుంచి పది రెట్లు ఖర్చు పెరిగిందని తెలిపారు.
35 టీఎంసీలు రెడీగా ఉన్నాయి
గోదావరికి వరదలు వచ్చినప్పుడు శ్రీరాంసాగర్నుంచి మిడ్ మానేర్‌కు నీళ్లు చేరిన వెంటనే అక్కడ ఉన్న రెండు పంపులను నడిపించి అనంతగిరి రిజర్వాయర్‌కు, అక్కడినుంచి అన్నపూర్ణ రిజర్వాయర్‌కు, తద్వారా రంగనాయక్‌సాగర్.. మల్లన్నసాగర్ మీదుగా కొండపోచమ్మ సాగర్‌కు నీళ్లు తెచ్చి పెట్టుకొన్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మేడిగడ్డ నుండి పంపులు ఎత్తిపోయాల్సిన అవసరం లేదని, మంచి వరద నీరు వచ్చింది కనుక ఒక లిఫ్ట్ ద్వారానే కరువు ప్రాంతానికి నీరు వచ్చిందని, బాగా కరువు వచ్చి ఎస్సారెస్పీలో, మిడ్ మానేరులో నీరు లేకపోతే అప్పుడు ప్రాణహిత నీళ్లను మేడిగడ్డ నుంచి తెచ్చుకొంటామని పేర్కొన్నారు. వర్షాలు బాగా పడటం వల్ల కొండపోచమ్మసాగర్‌లో 15, మల్లన్న సాగర్‌లో 14, అనంతగిరిలో 2 టీఎంసీలు, రంగనాయక సాగర్‌లో 2 టీఎంసీలు నింపి పెట్టుకున్నామన్నారు. తక్కువ విద్యుత్తు ఖర్చుతో మొత్తం 35 టీఎంసీలు రిజర్వాయర్లలో నిలువచేసి పెట్టుకొన్నామని తెలిపారు. మహారాష్ట్ర నుంచి గోదావరి ప్రవాహం పెరుగుతున్నప్పుడే సీఎం కేసీఆర్ ప్రతి నిమిషం మంత్రులను, అధికారులను అప్రమత్తంచేశారని హరీశ్‌రావు చెప్పారు. ఒక ప్రాణ నష్టం జరగకూడదని సీఎం మానిటరింగ్ చేశారని తెలిపారు. ప్రతి ఇంటికి మామూలుగా ఇచ్చే బియ్యం కాకుండా అదనంగా 25 కేజీల బియ్యం, రూ.పది వేలు, కందిపప్పు వంటివి ఇచ్చామన్నారు. ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ శాఖలకు రూ.పది కోట్ల చొప్పున ఇచ్చి మరమ్మతులు చేయాలని ఆదేశించారని వెల్లడించారు. వరద ముప్పు శాశ్వత పరిషారానికి వెయ్యి కోట్లు ప్రకటించామని చెప్పారు. వరద సమయంలో ములుగు, భద్రాద్రి జిల్లా, ఖమ్మం జిల్లా, మంచిర్యాల, నిర్మల్ జిల్లా కలెక్టర్లు, పోలీసులు, జిల్లా సిబ్బంది, వైద్యసిబ్బంది ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలు కాపాడేలా పని చేశారంటూ వారిని హరీశ్‌రావు అభినందించారు.
వరదపై బురద రాజకీయం
కొన్ని రాజకీయ పార్టీలు వరదలో కూడా బురద రాజకీయం చేస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. గతంలో శ్రీశైలంలో వరదలు వస్తే తాము అప్పటి సీఎం రోశయ్యకు అండగా ఉండి, కలిసి పనిచేశామని.. కానీ రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు ప్రజల శ్రేయస్సు కాకుండా రాజకీయాలే ముఖ్యమయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రకృతి వైపరీత్యాన్ని కూడా ప్రభుత్వ వైఫల్యంగా, మానవ తప్పిదంగా చూపే యత్నం చేస్తున్నారని చెప్పారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టులోని రెండు పంప్ హౌస్‌లలో నీళ్లు వస్తే కొందరు చంకలు గుద్దుకున్నారు. లక్ష కోట్ల ప్రాజెక్టు మునిగిపోయిందన్నారు. ఇక నాలుగేండ్ల వరకు నీళ్లు రావని సంతోషపడ్డారు’ అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కాళేశ్వరంలో మొత్తం 21 పంపు హౌస్‌లు ఉంటాయని, నది పక్కనే ఉన్న మేడిగడ్డ, అన్నారం పంపు హౌస్లలోకి మాత్రమే నీళ్లు వస్తే.. ప్రాజెక్టు అంతా మునిగి పోయినట్టు ప్రతిపక్షాలు రాక్షసానందం పొందాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. గోబెల్స్ అనేవాడు అబద్ధ్దాలకు ఆద్యుడిగా ఉండేవాడని, ఆయన ఎప్పుడో మరణించినా.. తెలంగాణలో మాత్రం ప్రతిపక్షాల రూపంలో ఇంకా బతికే ఉన్నాడని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి డిజైన్ లోపం లేదని స్పష్టంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది తెలంగాణ ప్రజలకు జీవధారగా మారిందని చెప్పారు.
డీపీఆర్ లేకుంటే అనుమతులు ఎలా ఇచ్చారు?
‘కాళేశ్వరం ప్రాజెక్టుకు డీపీఆర్ లేదని మొన్న ఒక కేంద్ర మంత్రి అంటరు. డీపీఆర్ లేకపోతే.. కేంద్ర జలసంఘం పది అనుమతులను ఎలా ఇచ్చింది?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. డిజైన్లను చూసి, డీపీఆర్‌ను అధ్యయనం చేసిన తరువాతే అనుమతులు ఇచ్చిందని తెలిపారు. ఏ కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చూసి అనుమతులిచ్చిందో.. అదే కేంద్రంలో ఉన్న మంత్రి వచ్చి డీపీఆర్ లేదనడం ఏమిటని నిలదీశారు. మరో కేంద్ర మంత్రి గడ్కరీ వేగంగా అనుమతులిచ్చింది మేమే అంటారని గుర్తుచేశారు. యాసంగి పంటకు ఎంత నీరు కావాలంటే అంత రైతులకు అందిస్తామని, కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత ఎస్సారెస్పీ స్టేజ్ 1, 2 లో 15 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీరు అందుతుందన్నారు. మెదక్ జిల్లాలో తాగు నీరు లేదని, కానీ సిద్దిపేట, మెదక్ జిల్లాలో బంగారం లాంటి పంటలు పండుతున్నాయన్నారు. ‘కేంద్ర మంత్రి ఒక ఎకరానికి కూడా నీరు రాలేదంటరు. కానీ ఒక ఎకరంకు నీరు రాకపోతే ఇంత పంట ఎలా పండింది?’ అని మంత్రి ప్రశ్నించారు. 2014-15లో రాష్ట్రంలో వరి ఉత్పత్తి 68 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే గత ఏడాది వరి ఉత్పత్తి 2 కోట్ల 59 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగిందన్నారు.