సూర్యాపేట, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : దశాబ్దాల తరబడి నీటి చుక్కకు నోచని కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టును గాలికొదిలేసి ఏటేటా నీటి మట్టం తగ్గిపోతున్న నాగార్జునసాగర్ దిగువన ఉన్న పాలేరు రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ ఏర్పాటు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే రూ.245 కోట్ల వ్యయంతో లిఫ్ట్ పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ జీవో జారీ చేశారు. కేవలం ఒక టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న పాలేరు రిజర్వాయర్ నుంచి ఇప్పటికే భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ కింద 20 వేల ఎకరాలు ఉండగా, మిషన్ భగీరథ ద్వారా ఖమ్మం జిల్లాలోని సగభాగంతోపాటు సూర్యాపేట జిల్లాలోని 5 మండలాలకు తాగునీటిని అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాలేరు రిజర్వాయర్ నుంచి మరో 45 వేల ఎకరాలకు 4.5 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయడం సాధ్యమయ్యే పనికాదని అంతర్గతంగా ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు.
కేవలం కమీషన్ల కోసమే ఈ లిఫ్ట్ పనులు చేపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లులేక ఎడారిగా మారిన సూర్యాపేట జిల్లా పరిధిలోని ఎస్ఆర్ఎస్పీ ఫేజ్-2 ఆయకట్టుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం జలధారగా మారింది. 2018 నుంచి సుమారు 450 కిలోమీటర్ల దూరం ప్రయణించి సూర్యాపేటకు కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు చేరుకోవడంతో ఇంచు భూమి లేకుండా సాగులోకి వచ్చింది. దాదాపు ఆరేండ్లపాటు అంటే 2023 వరకు రెండు పంటలను పండించుకున్న రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. రెండేండ్లుగా నీరందక లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తామేదో సాధిస్తామంటూ అక్కరకు రాని ఓ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని రూపొందించి పనులు ప్రారంభిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.
గత కొద్ది సంవత్సరాలుగా నాగార్జునసాగర్‌లోని నీటిమట్టం తగ్గుతూ వస్తున్నది. అలాంటిది సాగర్ దిగువన ఉన్న పాలేరు ప్రాజెక్టుకు నీళ్లు ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారిది. 2023లో సాగర్ ఎడమకాల్వ కింద సాగునీటికి ఇబ్బందులు రాగా, 2024లో అంతంత మాత్రంగానే అందాయి. కృష్ణా నది డేడ్ స్టోరేజ్ 510 అడుగులు కాగా, గత రెండేండ్లుగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 520 నుంచి 530 అడుగులకు మించి నమోదుకాలేదు. 2023లో 520 అడుగుల మేర ఉండగా, 2024లో 504, ప్రస్తుత 2025లో 511 అడుగుల మేర నీరు నిల్వ ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణా నది భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు కానీ, ఆ నీటిపై ఆశలు పెట్టుకొని కొత్త ఆయకట్టు సృష్టించడం చాలా కష్టతరమని ఇరిగేషన్ శాఖ అధికారులే చెప్తున్నారు. అయినా రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల ఒక టీఎంసీ సామర్థ్యం కలిగిన పాలేరు నుంచి రూ.245 కోట్ల వ్యయంతో 45వేల ఎకరాలకు నీటిని అందించే లిఫ్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ జీవో చేశారు.
దీని ద్వారా నీటిని ఎలా అందిస్తారో ఆ దేవుడికే తెలియాలనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటికే పాలేరు రిజర్వాయర్ నుంచి ఖమ్మం జిల్లాలోని భక్తరామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ కింద 20 వేల ఎకరాలు సాగవుతుండగా మరోపక్క సగ భాగం ఖమ్మం జిల్లాతోపాటు సూర్యాపేట జిల్లాలోని ఐదు మండలాలకు మిషన్ భగీరథతో తాగునీటిని అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలేరు రిజర్వాయర్ నుంచి మోతె, మునగాల, నడిగూడెం మండలాల పరిధిలోని 45 వేల ఎకరాలకు 4.5 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయడం సాధ్యమయ్యే పనికాదని అంతర్గతంగా ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తుండగా కేవలం కమీషన్ల కక్కుర్తి కోసమే ఈ లిఫ్ట్ పనులు చేపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిరుడు సూర్యాపేట జిల్లా పరిధిలోని తూములకు షట్టర్లు బిగించి ఎత్తకుండా వెల్డింగులు చేసి మరీ నీటిదోపిడీకి పాల్పడి ఖమ్మం జిల్లాకు తరలించిన విషయం విదితమే. అయినా పాలేరు వద్ద లిఫ్ట్ ఏర్పాటుచేస్తే భవిష్యత్తులో నీటి పంచాయితీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని మేడిగడ్డ వద్ద చిన్నపాటి కుంగుబాటును కాంగ్రెస్ ప్రభుత్వం బూచిగా చూపిస్తూ వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏడాదిన్నరగా మరమ్మతులు చేపట్టకుండా గాలికి వదిలేసింది. ఇప్పుడు అలవికాని చోట లిఫ్ట్ ఏర్పాటు చేయడం కంటే నిజంగా రైతులపై ప్రేమ ఉంటే, సాగునీటిని అందించాలనే తపన ఉంటే కమీషన్ల కోసం కక్కుర్తి పడకుండా మేడిగడ్డ వద్ద కుంగిన ఒకటి రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. తద్వారా మళ్లీ కాళేశ్వరం జలాలు జిల్లాకు చేరి మేలు జరుగుతుందని రైతులు ధృడంగా నమ్ముతున్నారు. అక్కడ ఒక్కో పిల్లర్ నిర్మాణానికి రూ.100 నుంచి 150 కోట్ల వరకు అవుతుందని ఇంజనీర్లు అంచనా వేస్తుండగా, కుంగిన నాలుగు పిల్లర్లకు రూ.400 నుంచి రూ.600 కోట్లకు మించి ఖర్చు కావని తేల్చి చెప్తున్నారు. అంతకు మించి వ్యయం అయినా ప్రభుత్వం ఆ నిధులు వెచ్చించాలే తప్ప, గాలికి వదిలేయడం రైతాంగాన్ని నట్టేట ముంచడమే అవుతుంది. నీళ్లు సరిపడా లేని పాలేరు వద్ద రూ.245 కోట్లతో లిఫ్ట్ ఏర్పాటుచేసే బదులు మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మతులు చేపట్టడమే ఉత్తమమని నిపుణులు తేల్చి చెప్తున్నారు.