పెద్దపల్లి, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టు అనగా కాంగ్రెస్ సర్కార్ ఎక్కడలేని వివక్షతను ప్రదర్శిస్తున్నది. ఏడాదికాలంగా కాళేశ్వరంతోపాటు ఇతర మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి విద్యుత్తు బిల్లులు చెల్లించకపోవడంతో దాదాపు రూ.3,404 కోట్ల్లు బకాయి పడింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా లక్ష్మీ, సరస్వతీ, పార్వతీ బరాజ్‌లు, పంపుహౌస్‌లను గత కేసీఆర్ సర్కార్ నిర్మించింది. ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను తరలించి లక్షలాది ఎకరాల్లో బీడు భూములను సస్యశ్యామలం చేసింది. ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో వ్యవసాయంతోపాటు ఇరిగేషన్‌శాఖపై పూర్తి స్థాయిలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఏడాదిగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన విద్యుత్తు బకాయిలు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టింది. పార్వతీ (సుందిళ్ల) బరాజ్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, నంది పంప్‌హౌస్‌తోపాటు ఇతర ప్రాజెక్టులకు సంబంధించి రూ.3,404 కోట్ల బకాయిలు పేరుకుపోగా.. చెల్లింపులు జరుపకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. దీంతో విద్యుత్తు శాఖకు బకాయిలు గుదిబండగా మారాయి.
కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు ఎలాంటి లాభంలేదని కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్నదంతా బూటకమని చెప్పే సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి. కాళేశ్వరంలో అంతర్భాగమైన లక్ష్మీ బరాజ్‌లో రెండు పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరమే లేదని, ఆ ప్రాజెక్టుతో సంబంధమే లేకుండా పంటలు పండాయని పేర్కొన్న రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన పంపులు నడవనిదే బిల్లులు ఎలా వచ్చాయో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్-2లోని ధర్మారం మండలం నందిమేడారంలో గల నంది పంప్‌హౌస్‌లోని బాహుబలి మోటర్ల ఎత్తిపోతల వల్లే రాష్ట్రంలో గత యాసంగిలో సాగైందనే విషయం స్పష్టమవుతున్నది. ఇందుకు నందిమేడారం పంప్‌హౌస్‌కు రూ.2,672 కోట్లు, గోలివాడ పంప్‌హౌస్‌కు రూ.564 కోట్లు, సుందిళ్ల పంప్‌హౌస్‌కు సంబంధించి రూ.406 కోట్లు మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.978 కోట్లు విద్యుత్తు బిల్లులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటితోపాటు ఎల్లంపల్లి, ఇతర మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి రూ.426 కోట్లు బకాయిలు ఉన్నాయి. మొత్తంగా నీటి పారుదలశాఖ ప్రాజెక్టులకు సంబంధించి రూ.3,404 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ బిల్లుల చెల్లిపుపై ఏడాదిగా నిర్లక్ష్య ం చూపుతున్నది. అదే విధంగా ఇతర 21ప్రభుత్వ శాఖలకు సంబంధించి సైతం రూ. 31.48కోట్ల బకాయిలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం రూ.3,728.48కోట్ల విద్యుత్ బకాయిలు ఉండగా, అందులో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినవే రూ.3,404కోట్లు ఉండటం గమనార్హం.
రాష్ట్రవ్యాప్తంగా యాసంగి సాగు బాగైందని గప్పాలు కొట్టుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం కూలేశ్వరమైందని ప్రతీ సభలో చెప్తూ కేసీఆర్‌పై అపవాదులు మోపుతున్నారు. అయితే.. అసలు సాగైందే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అనే వాస్తవాలు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన పంప్‌హౌస్‌ల విద్యుత్తు బిల్లులే చెప్తున్నాయి. ఈ బిల్లులు సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ నాయకుల వాదనలకు చెంపపెట్టులా నిలుస్తున్నాయి. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు సత్ఫలితాలు రైతులందరికీ తెలుసు. ఒక అబద్ధాన్ని నిజం చెయ్యడం కోసం పదే పదే అబద్ధాలు చెప్తున్నా.. అసత్యమనేది గుర్తిస్తున్నారు.