ధర్మారం/ రామడుగు, ఏప్రిల్ 8: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2 పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి శ్రీ రాజరాజేశ్వర జలాశయం (మిడ్‌మానేర్)కు గోదావరి జలాల ఎత్తి పోతలు నాలుగురోజులుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం నంది పంప్‌హౌస్‌లోని 1, 7 నంబర్ల మోటర్ల ద్వారా 6,300 క్యూసెకుల నీటిని ఎత్తిపోయించారు.
అక్కడి నుంచి నంది రిజర్వాయర్కి చేరిన నీరు జంట సొరంగాల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంపుహౌస్‌కు చేరుకున్నా యి. అకడ 1, 7 బాహుబలి మోటర్లను ఆన్‌చేసి అదే పరిమాణంలో ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి అప్రోచ్ కెనాల్ ద్వారా వరద కాలువ, శ్రీ రాజరేశ్వర జలాశయానికి తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 0.7 టీఎంసీల నీరు తరలినట్టు నీటి పారుదలశాఖ ఇంజినీరింగ్ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు.