హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) నుంచి తీసుకున్న అప్పు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినట్టు తెలిసింది. చివరి కిస్తీగా రెండు సంస్థలకు కలిపి రూ.20 వేల కోట్లు చెల్లించినట్టు సమాచారం. రెండు సంస్థలకు నయాపైసా బాకీ లేమని ఆర్థికశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నెలవారీ కిస్తీ మొత్తాన్ని చెల్లించకుంటే కాళేశ్వరం ప్రాజెక్టును ఎన్పీఏ (నిరర్థక ఆస్తి)గా ప్రకటిస్తామని ఆర్ఈసీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్థిక శాఖ వర్గాలు స్పందించాయి. ఆ రెండు సంస్థలకు సంబంధించిన రుణాలు మొత్తం చెల్లించినట్టు వివరిస్తున్నాయి. ఆర్ఈసీకి చివరి కిస్తీగా రూ.11,500 కోట్లు, పీఎఫ్సీకి దాదాపు రూ.8,500 కోట్లు మొత్తం గా రూ.20 కోట్లు చెల్లించినట్టు వెల్లడించాయి.
ఇదిలాఉంటే, ఆయా సంస్థలకు చెల్లించిన రుణమొత్తాన్ని ప్రభుత్వం రీషఫ్లింగ్ చేస్తున్నట్టు తెలిసింది. 8.5% నుంచి 11% వడ్డీ రేట్లున్న అప్పులను ఆయా సంస్థలకు తీర్చేసి, ఓపెన్ మారెట్ రుణాలకు వెళ్లాలని గతంలో బీఆర్ఎస్ హయాంలోనే ప్రభుత్వం ప్రయత్నించింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అదే విధానాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నది. 7.5% వడ్డీతో దీర్ఘకాలిక ప్రాతిపదికపై కొత్తరుణాలను తీసుకొచ్చి పాత రుణాలను చెల్లించాలని నిర్ణయించింది.
తద్వారా ప్రభుత్వంపై నెలకు రూ.700 కోట్లు, ఏటా రూ.8 వేల కోట్ల భారం తగ్గుతుందని అంచనా వేసింది. రుణాలను రీషఫ్లింగ్ చేస్తున్నది. ఈ క్రమంలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.26 వేల కోట్ల రుణాల రీషఫ్లింగ్ అవుతున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. అందులోభాగంగా ఆర్ఈసీ, పీఎఫ్సీల రుణమొత్తాన్ని చెల్లించినట్టు ఆర్థిక శాఖ వర్గాలు వివరిస్తున్నాయి. రుణం క్లియర్ చేస్తున్న మేరకు ఎఫ్ఆర్బీఎంలో కొత్త గా వెసులుబాటు లభిస్తున్నదని, ఆ మే రకు అప్పులు చెల్లిస్తూ ముందుకెళ్తున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి.