హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): పార్ట్‌టైమ్ జాబ్ ఇన్వెస్ట్మెంట్ల పేరుతో విదేశాల నుంచి మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల ముఠాకు భారత్‌లో ప్రధాన సమన్వయకర్త (కింగ్‌పిన్)గా వ్యవహరిస్తున్న రోనక్ భరత్‌కుమార్ కక్కడ్ను హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైకి చెందిన కక్కడ్ దుబాయ్, తైవాన్, చైనాలోని సైబర్ నేరగాళ్లను సమన్వయపర్చడంతోపాటు భారత కరెన్సీని దినార్ల రూపంలోకి, ఆ తర్వాత క్రిప్టో కరెన్సీ రూపంలోకి మార్చి తైవాన్ మీదుగా చైనాకు పంపడంలో కీలక భూమిక పోషిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
అతనికి ఉన్న రెండు బ్యాంకు ఖాతాలతోపాటు ఇతరులకు సంబంధించిన దాదాపు 100 బ్యాంకు ఖాతాల నుంచి గత 6 నెలల్లోనే రూ.400 కోట్లకుపైగా లావాదేవీలు నిర్వహించినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా సోషల్ మీడియాలో వివిధ కంపెనీలను ప్రమోట్ చేసే కక్కడ్.. తైవాన్‌కు చెందిన స్వాంగ్ లిన్, యూరప్‌కు చెందిన ఇరీన్తో కలిసి పార్ట్‌టైమ్ జాబ్‌ల పేరుతో ఎంతో మంది యువతను మోసగించి, భారీగా డబ్బు దండుకున్నట్ట్టు తేలింది.