హనుమకొండ చౌరస్తా, మార్చి 16 : కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థినులు కొట్టడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించిన ఓ విద్యార్థిని చికిత్స పొందుతూ సోమవారం మరణించింది. కుటుంబ సభ్యులు, కేయూ పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం ఎర్రుపాలెం బనిగండ్లపహాడ్కు చెందిన పెదమళ్ల శ్రీవిద్య.. కాకతీయ యూనివర్సిటీ పద్మాక్షి హాస్టల్ ఉంటూ ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ రెండో సంవత్సరం చదువుతున్నది. అదే బ్లాక్‌లో ఉంటున్న తోటి విద్యార్థినులతో ఈనెల 4న గొడవ జరిగింది. శ్రీవిద్య ల్యాప్‌టాప్ తీసి దాచిపెట్టిందని గదిలో ఉండే విద్యార్థినులు కేయూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్రీవిద్యను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించా రు. శ్రీవిద్యపై ల్యాప్‌టాప్ దొంగతనం మోపడం, కొట్టడం, రెండు రోజులు రూ మ్‌లోనే బంధించారు. కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో వారు ఈ నెల 7న వచ్చి శ్రీవిద్యను ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికెళ్లిన శ్రీవిద్య అదేరోజు రాత్రి ఎలుకల మందు తాగింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే మధిరలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు అక్కడ నుంచి నిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించి సోమవారం సాయంత్రం మృతిచెందింది. ఈ విషయంలో విచారణ చేపడుతామని కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రాంచంద్రం పేర్కొన్నారు.