హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): విభజన చట్టం రూపొందించేటప్పుడే తెలంగాణకు తీవ్ర అన్యా యం జరిగిందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ‘ఏపీ పునర్విభజన చట్ట హామీలను తెలంగాణలో అమలు చేయడంలో కేంద్రం వైఫల్యాలు’ అనే అంశంపై మంగళవారం జరిగిన లఘు చర్చను శాసన మండలిలో కడియం శ్రీహరి ప్రారంభించారు. తెలంగాణకు కేటాయించిన గిరిజన వర్సిటీ నేటికీ ప్రారంభానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం ఏ ఒక్క విభజన హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. వెంకయ్యనాయుడు కేంద్రమంత్రిగా ఏపీకి రావాల్సిన అన్నింటినీ దగ్గరుండి ఇప్పించారని.. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి ఢిల్లీ నుంచి వచ్చి ప్రెస్మీట్లు పెట్టడం, కేసీఆర్ ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకొన్నారని కిషన్‌రెడ్డిని ఉద్దేశించి వ్యా ఖ్యానించారు. బండి సంజయ్, కిషన్‌రెడ్డికి తెలంగాణపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలు అమలు చేసే లా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాం డ్‌చేశారు. కేసీఆర్ నేతృత్వంలోనే బీజేపీ ముక్త్ భారత్ సాధ్యమవుతుందని కడియం ధీమా వ్యక్తం చేశారు.