హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 16, (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నీటి కష్టాలను పట్టించుకోకుండా సీఎం రేవంత్‌రెడ్డి దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారని కేఏ పాల్ విమర్శించారు. ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన ఒక వీడియో పోస్టు చేశారు. ‘పదేండ్లు సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి గొప్పలు చెప్తున్నాడు. నేను నివాసముండే అమీర్‌పేట్ అపార్ట్మెంట్లో శనివారం కనీసం మంచినీళ్లు రాలేదు. ట్యాంకర్లతో నీటిని తెప్పించుకుంటున్నాం.
కోటి 20 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్‌లోనే ఈ పరిస్థతి ఉంటే, నాలుగు కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం పరిస్థితి ఏంటి? మార్చి నెలలోనే ఇంత కరువు ఉంటే, ఏప్రిల్, మేలో ప్రజలు నీటికోసం ఇబ్బందిపడాల్సిందేనా?’ అని ప్రశ్నించారు. నేను వరంగల్‌లో పోటీ చేయకుండా నీకు మద్దతిచ్చి గెలిపిస్తే, నువ్వేమో బీజేపీ వాళ్లను గెలిపిస్తున్నావంటూ మండిపడ్డారు. పదిహేను నెలల రేవంత్‌రెడ్డి పాలనలో విద్యార్థులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోకుండా రాహుల్‌గాంధీకి మూటలు మోస్తున్నాడని ఆరోపించారు.