హైదరాబాద్, ఆగస్టు (నమస్తే తెలంగాణ): దేశ ప్రజలకు సత్వర న్యాయం జరగాలంటే న్యాయవ్యవస్థ వికేంద్రీకరణ జరగాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ కోరారు. దీనికోసం ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై లేదా హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు రీజినల్ బెంచ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యులు సోమా భరత్‌కుమార్, కళ్యాణ్రావుతో కలిసి బుధవారం మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం 34 మంది న్యాయమూర్తులే ఉన్నారని, ఆ సఖ్యను 64కు పెంచితే తప్పేమిటని వినోద్‌కుమార్ ప్రశ్నించారు. ప్రాంతీయ ధర్మాసనాలు ఉండాలని తాను ఎంపీగా ఉన్పప్పుడు పార్లమెంట్లో లేవనెత్తడమే కాకుండా రాజ్యాంగ చట్ట సవరణకు ప్రతిపాదించిన విషయాన్ని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా 5.1 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. దేశంలో ఇప్పటివరకు లా కమిషన్లు అనేక నివేదికలు ఇచ్చినా, సుప్రీంకోర్టు రీజినల్ బెంచ్‌లు ఏర్పాటు ప్రతిపాదనలనూ కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. రీజినల్ బెంచ్‌ల ఏర్పాటు అంశాల పరిశీలనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమ్మతి అవసరమని, ఆ మేరకు రాజ్యాంగంలోని 130వ ఆర్టికల్‌ను సవరించాలని సూచించారు. రీజినల్ బెంచ్‌లు ఏర్పాటు చేస్తే దేశ సమగ్రత దెబ్బతింటుందంటూ ఢిల్లీలో ఉన్న కొందరు న్యాయమూర్తులు, న్యాయవాదులు చేస్తున్న వాదన అర్థరహితం అని పేర్కొన్నారు.
న్యాయ వికేంద్రీకరణకు తెలంగాణ అద్భుత ఉదాహరణని వినోద్‌కుమార్ కొనియాడారు. రాష్ట్ర హైకోర్టు విభజన సమయంలో తెలంగాణకు 24 మంది, ఏపీకి 37 మంది న్యాయమూర్తుల కేటాయింపులు జరిగాయని గుర్తు చేశారు. సత్వర న్యాయం జరగాలంటే న్యాయవ్యవస్థ వికేంద్రీకరణ జరగాలని భావించిన ఆనాటి సీఎం కేసీఆర్ న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచాలన్న ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించిందని తెలిపారు. 10 జిల్లాల నుంచి 33 జిల్లాల సంఖ్యకు అనుగుణంగా జిల్లా న్యాయస్థానాలు వచ్చాయని, తద్వారా కేసుల పెండింగ్ సమస్య తగ్గుతుందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో న్యాయ వ్యవస్థకు తకువ నిధులను కేటాయిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్ విమర్శించారు. బడ్జెట్లో 0.1 శాతమే న్యాయ వ్యవస్థకు కేటాయించినట్టు వివరించారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే కేసుల పెండింగ్ విషయంలో దేశం 93వ స్థానంలో ఉన్నదని, ఈ నేపథ్యంలోనే దేశానికి వివిధ దేశాల నుంచి పెట్టుబడులు రావడం లేదని తెలిపారు.