హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : నీటిపారుదల ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కారు కట్టుకథలు చెప్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. కమిషన్లు, కమిటీల నివేదికల పేరిట కేసీఆర్‌పై కుట్రలకు దిగుతున్నదని మండిపడ్డారు. లీకులు ఇస్తూ రాక్షసానందం పొందుతున్నదని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలోనే పాలమూరుకు న్యాయం జరిగిందని చెప్పారు. నాడు నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా ప్రాజెక్టులతోపాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని 90 శాతం వరకు పూర్తిచేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. కేసీఆర్ హయాంలో 188 చెక్‌డ్యాంలు నిర్మించి, 8.5 లక్షల ఎకరాలకు నీరందించారని చెప్పారు. కేసీఆర్ దూరదృష్టితో చేపట్టిన చర్యలతో పంటలు దండిగా పండి.. పాలమూరు పచ్చబడిందని తెలిపారు. సోమవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, శాట్స్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి శ్రీనివాస్‌గౌడ్ విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి.. లక్ష కోట్లు దండుకున్నారని కాంగ్రెస్ నేతలు వితండవాదనకు దిగుతున్నారని మండిపడ్డారు. అవినీతి జరిగితే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల నిర్మాణం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. పాలమూరు బిడ్డనని గొప్పలు చెప్పుకొనే రేవంత్‌రెడ్డి పాలనలో జిల్లాకు ఒరిగిందేమీలేదని నిప్పులుచెరిగారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేయడంలో రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నారని, రైతాంగానికి సాగునీరందించే విషయంలో కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధిలేదని మండిపడ్డారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో చేపట్టిన జలయజ్ఞనాన్ని ధనయజ్ఞనం అని అసెంబ్లీ సాక్షిగా విమర్శలు గుప్పించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు వైఎస్ గురించి గొప్పలు చెప్పడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి మాటలకు.. పనులకు పొంతన లేదని ధ్వజమెత్తారు.
కాళేశ్వరం కమిషన్ నివేదికపై లీకులు ఇస్తూ కాంగ్రెస్ నేతలు రాక్షసానందం పొందుతున్నారని శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా లాంటి వినూత్న పథకాలను అమలు చేసిన కేసీఆర్‌ను అక్రమార్కుడిగా చిత్రీకరించే ప్రయత్నాలు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలతో, సాగునీరందక రైతులు అల్లాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలకులు పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టకుండా అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కేసీఆర్ హయాంలో నిర్మించారనే అక్కసుతో.. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు ఓర్వలేకనే కుట్రలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసమే మేడిగడ్డ బరాజ్ కింద కాంగ్రెస్ నాయకులు బాంబులు పెట్టారేమోనని అనుమానం వ్యక్తంచేశారు. నిజంగా రైతుల పొలాలను తడపాలని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. వెంటనే మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. కొడంగల్ ప్రాజెక్టు కోసం భూసేకరణ పేరిట కాంగ్రెస్ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 20 నెలల్లో ఎకరాకు కూడా నీరందించని సీఎం రేవంత్‌రెడ్డిని.. కాంగ్రెస్ నాయకులు పొగడడం విడ్డూరంగా ఉన్నదని విమర్శలు గుప్పించారు.