యాదగిరిగుట్ట, అక్టోబర్ 11: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ నిర్మాణశైలి అత్యద్భుతంగా ఉన్నదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్‌సింగ్ కితాబునిచ్చారు. శనివారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ శరత్, జస్టిస్ కే సుజన, జస్టిస్ రామకృష్ణారెడ్డితో కలిసి సీజే స్వామివారిని దర్శించుకున్నారు. కొండపైకి చేరుకున్న ప్రధాన న్యాయమూర్తి బృందానికి కలెక్టర్ హనుమంతరావు, ఇన్చార్జి ఈవో గుగులోతు రవినాయక్ పుష్పగుచ్ఛం అందజేసి ఘనస్వాగతం పలికారు.
వీవీఐపీ అతిథి గృహంలోకి వెళ్లి సంప్రదాయ దుస్తులను ధరించిన ప్రధాన న్యాయమూర్తి స్వయంభూ ప్రధానాలయంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రధానాలయంలోకి చేరుకున్న వారు ధ్వజ స్తంభాన్ని దర్శించుకుని గర్భాలయంలోకి వెళ్లి స్వయంభూ పంచనారసింహస్వామివారికి పూజలు జరిపారు. దర్శనానంతరం ఆలయ ముఖ మండపంలో వారికి ప్రధానార్చక బృందం చతుర్వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో స్వామివారి మహాప్రసాదం, చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం వీవీఐపీ అతిథి గృహంలో వర్చువల్‌గా మంచిర్యాల జిల్లా కోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
భువనగిరి అర్బన్, అక్టోబర్ 11: యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు నూతన భవన నిర్మాణానికి భువనగిరి పట్టణ పరిధిలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నూతన భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కే శరత్, జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ కే సుజన, జస్టిస్ వీ రామకృష్టారెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ జయరాజు, కలెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.