మహబూబ్నగర్, మే 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కృష్ణ, తుంగభద్ర నదులకు వరద మొదలైంది. కృష్ణమ్మకు ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో జూరాల ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది. దీంతో గురువారం ప్రాజెక్టు 12 గేట్లను తెరిచిన అధికారులు దిగువకు 82 వేల క్యూసెక్కులను శ్రీశైలం జలాశయం వైపు విడుదల చేశారు. అర్ధరాత్రి వరకు లక్ష క్యూసెక్కులు దాటే అవకాశం ఉన్నదని అధికారులు చెప్తున్నారు. మరోవైపు తుంగభద్ర నదికి వరద పోటెత్తెతున్నది. 15 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. సుంకేసుల డ్యాం నిండిపోవడంతో మధ్యాహ్నం మూడు గేట్లు ఎత్తి.. సాయంత్రానికి ఒక గేటు ద్వారా నీటిని విడుదల చేశారు.
ఆర్డీఎస్ వద్ద 5,913 క్యూసెక్కులుగా నమోదైంది. రెండు జీవనదులు పొంగిపొర్లుతుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. వర్షాకాలం ఇంకా ప్రారంభం కాకముందే ప్రధాన నదులకు వరద పోటెత్తడం ఇదే తొలిసారి. నాలుగు రోజుల కిందట కృష్ణానదికి స్వల్పంగా వచ్చిన వరద క్రమంగా పెరుగుతూ కొన్ని గంటల్లోనే జూరాల నిండిపోయింది. శుక్రవారం వరకు ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నదని, దీంతో మరిన్ని గేట్లు తెరిచే అవకాశం ఉన్నదని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.