హైదరాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ) : తొడగొట్టి సవాల్ విసరడం తీరా సమయానికి తోకముడవటం కాంగ్రెస్ నేతలకు అలవాటేననే వాళ్లే నిరూపిస్తున్నారు. గురువారం తెలంగాణ భవన్‌కు వస్తా.. చర్చలకు సిద్ధంగా ఉండాలంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ చేయడం గైర్హాజరు కావడం ఆయనకే చెల్లించింది. మంత్రి సవాల్ మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఉదయం 10గంటలకే తెలంగాణ భవన్‌కు చేరుకొన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం అక్కడి మెయిన్ హాల్లో ప్రత్యేకంగా కుర్చీ వేయడమే గాక ఆయనకు కప్పేందుకు శాలువా, పూలబొకే కూడా తెప్పించారు. చర్చలకు అనువుగా మైక్, సౌండ్ సిస్టం సహా అన్ని ఏర్పాటుచేసి మంత్రి జూపల్లి కోసం ఎదురుచూశారు. కానీ, మంత్రి మాత్రం చర్చలకు డుమ్మాకొట్టారు.
ఆ తర్వాత మంత్రి మాటమార్చి గన్‌పార్క్‌కు రావాలనడంతో అక్కడికే వస్తామని బయల్దేరిన హరీశ్‌రావు, ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేసి కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. హరీశ్‌రావుతో పాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి తదితరులు కూడా కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.
తాము పోలీస్‌స్టేషన్‌లోనే ఉంటామని, మంత్రులు బీఆర్ఎస్ కార్యాలయానికి రాలేకపోతే కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు రావాలంటూ హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ తదితరులు సవాల్ విసిరారు. అయితే, మంత్రులు అటు తెలంగాణ భవన్‌కు, ఇటు కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు రాలేదు.