హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నవాబుపేట మండలం వెంకటేశ్వర తండాకు చెందిన సుమారు 150 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. సిద్దిపేట జిల్లా మరూక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో శుక్రవారం వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
నాయకుడు చందర్‌నాయక్ నేతృత్వంలో రెండు బస్సుల్లో ఎర్రవల్లి నివాసానికి వచ్చిన నాయకులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిశారు. పార్టీలో చేరినవారిలో సర్పంచ్ అభ్యర్థిగా ఓడిపోయిన బాబునాయక్, కాంగ్రెస్ ఉపసర్పంచ్ తావూరియా, ఆరుగురు వార్డుసభ్యులు, వెంకటేశ్వర తండా సర్పంచ్ సేవ్యానాయక్, కొల్లూరు మాజీ సర్పంచ్ రాజు ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై, పార్టీ నాయకత్వంపై నమ్మకంతోనే తాము బీఆర్ఎస్లో చేరినట్టు నాయకులు తెలిపారు.