హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ గచ్చిబౌలిలో 2016లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టివేయాలని కోరుతూ ఏ రేవంత్‌రెడ్డి 2020లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్ కే లక్ష్మణ్ మంగళవారం ప్రకటించారు. రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదు చేసిన వ్యక్తి తరపున గతంలో న్యాయవాదిగా ఉంటూ వాదనలు వినిపించినందున ఈ కేసు విచారణ చేయబోమని వెల్లడించారు. గోపన్నపల్లిలో సర్వే నం.127లోని 31 ఎకరాలకు సంబంధించిన హకుల వివాదంలో ఎస్సీ మ్యూచ్యువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి, రేవంత్‌రెడ్డి సోదరుడు ఏ కొండల్‌రెడ్డి, ఏ లక్ష్మయ్య మధ్య వివాదం నెలకొంది. అప్పుడు ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రోత్సాహంతో సొసైటీకి చెందిన స్థలంలోకి అక్రమంగా చొరబడ్డారని, అడ్డుకున్న తనను కులం పేరుతో దూషించారంటూ ఎన్ పెద్దిరాజు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టేయాలంటూ 2020లో రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్ లక్ష్మణ్ ప్రకటించారు. మరో న్యాయమూర్తి విచారణ చేపట్టేలా తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజస్ట్రీకి ఉత్తర్వులు జారీచేశారు