(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్‌కు (Congress) జూబ్లీహిల్స్ (Jubilee hills By-Election) ఓటరు గట్టిగా బుద్ధి చెప్పనున్నాడా? పోలింగ్‌కు ఇంకా పది రోజుల సమయం ఉండగానే జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ (BRS) పార్టీ గెలుపు ఖాయమైందా? రేవంత్ బుల్డోజర్ పాలనపై ఓటర్లు విసుగెత్తిపోయారా? తాజా పరిణామాలను విశ్లేషిస్తే.. ఇది నిజమేననిపిస్తున్నది. కేసీఆర్ (KCR) దిశానిర్దేశంలో దివంగత మాగంటి గోపీనాథ్ నేతృత్వంలో జూబ్లీహిల్స్‌లో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకొంటూ.. ఆయన సతీమణి మాగంటి సునీతకు అక్కడి ప్రజలు సంఘీభావం వ్యక్తం చేస్తున్నా రు. దీన్ని ధ్రువపరుస్తూ.. మొన్నటికి మొన్న ‘కోడ్మో-కనెక్టింగ్ డెమోక్రసీ’ సంస్థ, ‘కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్’ సంస్థ వేర్వేరుగా నిర్వహించిన సర్వేలో బీఆర్ఎస్దే విజయమని తేలింది. నిన్న మైనార్టీలు ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్‌లో 50.5 శాతం మంది ముస్లింలు గులాబీ పార్టీకి పట్టంగట్టినట్టు ‘బిలియన్ కనెక్ట్’ సర్వేలో తేటతెల్లమైంది. తాజాగా ‘చాణక్య స్ట్రాటజీ’ సంస్థ చేసిన సర్వేలోనూ జూబ్లీహిల్స్‌లో గులాబీ జెండానే ఎగురబోతున్నట్టు వెల్లడైంది. ఈ మేరకు ఓ యూట్యూబ్ చానల్ నిర్వహించిన టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో ‘చాణక్య స్ట్రాటజీ’ సంస్థకు చెందిన ఎన్నికల వ్యూహకర్త ముకేశ్ తమ సర్వేకు సంబంధించిన పలు కీలక విషయాలు తెలిపా రు. బయటి సర్వేలే కాదు.. కాంగ్రెస్ అం తర్గత సర్వేల్లోనూ.. హస్తంపార్టీ కంటే బీ ఆర్ఎస్ పార్టీనే జూబ్లీహిల్స్‌లో ముందంజలో ఉన్నట్టు తేలడం గమనార్హం.
బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటలా పిలిచే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ విజయాలు సాధించారు. దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్యంతో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైం ది. దీంతో హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రాజకీయం ఆసక్తి రేపుతున్నది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఓటర్ల మనోగతాన్ని తెలుసుకొనేందుకు ‘చాణక్య స్ట్రాటజీ’ అనే సంస్థ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఈనెల 24 వరకూ నెలరోజులపాటు కొనసాగిన ఈ సర్వేలో 7,200 శాంపిల్స్‌ను సేకరించారు. సర్వేలో పాల్గొన్న మెజార్టీ ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకే తమ ఓటు అని పేర్కొన్నట్టు ముకేశ్ పేర్కొన్నారు. దివంగత మాగంటి గోపీనాథ్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు-సంక్షేమ పథకాలు, భర్తను కోల్పోయిన సునీతకు ఆడబిడ్డల సానుభూతి ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌తో పోలిస్తే, సునీతకు 5 నుంచి 6శాతం మేర ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశమున్నట్టు ఆయన అంచనా వేశారు. నవీన్ కంటే సునీతకు 10వేల ఓట్లు ఎక్కువ వస్తాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన నవీన్ యాదవ్ కేవలం తన సొంత సామాజికవర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నట్టు సర్వేలో తేలింది. దీంతో మిగతా బీసీ వర్గాలకు ఆయన పూర్తిగా దూరమైనట్టు ముకేశ్ అభిప్రాయపడ్డారు. మైనారిటీ ఓటర్లను నమ్ముకొని గెలవడం నవీన్ యాదవ్‌కు ఎంతో కష్టమని తెలిపారు. ఇక, రేవంత్ ప్రభుత్వ పాలనలో పడిపోయిన రియల్ ఎస్టేట్, హైడ్రా బుల్డోజర్ చర్యలపై జూబ్లీహిల్స్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది. రెండేండ్లు పూర్తయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా పూర్తిచేయకపోవడం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణంగా స ర్వే అభిప్రాయపడింది. వెరసి ఇది జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని రెండో స్థానానికి పరిమితం చేయొచ్చని అంచనా వేసింది. కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడంటూ సోషల్‌మీడియాలో ప్రచారమవుతున్న వార్తలన్నీ పుకార్లేనని తేల్చి చెప్పింది. ఇక, బీజేపీ పోటీని కూడా ఇవ్వలేదని సర్వేలో తెలిపింది.
జూబ్లీహిల్స్‌లో ఇటీవల సర్వేలు నిర్వహించిన ఆయా సంస్థలకు అపారమైన విశ్వసనీయత ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ‘చాణక్య స్ట్రాటజీ’ సంస్థ ఇంతకుముందు తెలంగాణ సహా ఇతర రాష్ర్టాల్లో నిర్వహించిన పలు సర్వేల ఫలితాలు దాదాపుగా నిజమైనట్టు నిపుణులు అంటున్నారు. నిరుడు ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమికి 160 సీట్లు వస్తాయని కేకే సర్వేస్ అంచనా వేసింది. ఫలితాల్లో దాదాపుగా అవే రిజల్ట్స్ రిపీట్ అయ్యాయి. ఇక, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని కేకే సంస్థ అంచనా వేయగా.. అప్పుడు కూడా అలాగే జరిగింది. కాంగ్రెస్ తరఫున రాజస్థాన్, మ హారాష్ట్రలో కోడ్మో సంస్థ గతంలో సర్వే నిర్వహించింది. ఇటీవలి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మళ్లీ సర్వేను చేపట్టింది. కోడ్మో సంస్థ సర్వేల్లో వచ్చిన ఫలితా లే.. ఆయా ఎన్నికల్లో రిపీట్ కావడం వి శేషం. ఈ అన్ని సర్వేలూ జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్దే విజయమని తేల్చి చెప్తునాయి. దీంతో బీఆర్ఎస్దే విజయమని పలు వురు అభిప్రాయపడుతున్నారు.