బీఆర్ఎస్లో చేరిన రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీపీ చెకల ఎల్లయ్యముదిరాజ్, ఆయన కుమారుడు,
జూబ్లీహిల్స్‌లో గత స్వతంత్ర అభ్యర్థి అంజిబాబు దంపతులు
మరో రెండేండ్లలో మన ప్రభుత్వం వస్తుంది. ఎవరి బెండు తీయాలో, ఎవరెవరి సంగతి చూడాలో అన్ని చూస్తా. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ సంగతి తెలుసు. ఫహీం సంగతీ తెలుసు. అందరి జాతకాలు తెలుసు. ప్రకాశ్‌గౌడ్ ఎవరి అభివృద్ధి కోసం పోయాడో తెలుసు. అన్నీ బయటకు వస్తయి. సుల్తాన్‌ఫూర్ బయటకు వస్తది. ఘాన్సిమియాగూడ బయటకు వస్తది.అన్నీ బయటకు వస్తయి.
-కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేస్తే మోదీ సర్కారు షేక్ కాదా? రాహుల్‌గాంధీ పిలిచి మాట్లాడరా? బీసీలకు 42 శాతం బిల్లు పాస్‌కాదా? అని నిలదీశారు. కులమతాలకు అతీతంగా అందరూ కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్‌కు మొదటి దెబ్బ జూబ్లీహిల్స్లోనే కొట్టాలని, బీఆర్ఎస్ జైత్రయాత్ర ఇక్కడి నుంచే మొదలుకావాలని పిలుపునిచ్చారు. బిందువు, బిందువు కలిసి సింధువు అయినట్టు ఒక్కొక్కరు తమకు తెలిసిన బంధువులు, స్నేహితులకు బీఆర్ఎస్కు ఓటేయాలని చెప్పాలని కోరారు.
ఇకపై ఇంతకు ముందులెక్క ఉండదని, అందరి లెక్కలు తేల్చుతామని హెచ్చరించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన డీసీఎంఎస్ మాజీ చైర్మన్, మాజీ ఎంపీపీ చెకల ఎల్లయ్య ముదిరాజ్, ఆయన కుమారుడు పెద్దషాపూర్ మాజీ సర్పంచ్ చెకల చంద్రశేఖర్, 2018లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసిన అంజిబాబు దంపతులు తమ అనుచరులతో కలిసి ఆదివారం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆక్రమణల పేరుతో పేదల ఇండ్లను హైడ్రా ద్వారా కూలగొడుతున్నారని విమర్శించారు. ఇప్పటివరకు ఒక బడాబాబు ఇల్లు అయినా కూల్చారా? అని ప్రశ్నించారు. మూసీకి అడ్డంగా, చెరువులో కడుతున్న, కట్టిన కాంగ్రెస్ నేతల నివాసాల జోలికి మాత్రం హైడ్రా వెళ్లడం లేదని మండిపడ్డారు.
హైడ్రాకు ఆ దారి దొరకడం లేదు
పేదల వద్ద అన్ని రకాల పత్రాలు ఉన్నా రాత్రికిరాత్రే కూల్చుతున్న హైడ్రాకు బడా నేతల ఇండ్లు కూల్చడానికి మాత్రం దారి దొరకడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు చెరువు బఫర్‌లో ఉన్నది. ఆ ఇంటి జోలికి వెళ్లరు. పట్నం మహేందర్‌రెడ్డ్డి గెస్ట్‌హౌస్ చెరువులో ఉన్నా పట్టించుకోరు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ ఇండ్లు చెరువులోనే ఉన్నా హైడ్రా టచ్ చేయదు. కేవీపీ రామచంద్రరావు ఇంటి జోలికి కూడా వెళ్లరు. పెద్దల ఇండ్ల వద్దకు వెళ్లడానికి హైడ్రాకు దారి దొరకదు. పేదల ఇండ్లు కూలిస్తే అడిగేవారు లేరని భావిస్తున్నారు. పెద్దల వద్ద డబ్బులు గుంజి బెదిరింపులకు దిగుతున్నారు’ అని కేటీఆర్ మండిపడ్డారు.
రియల్ ఎస్టేట్ కుప్పకూలడానికి కాగ్రెస్ విధానాలే కారణం
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలడానికి కాంగ్రెస్ ప్రభుత్వ దిక్కుమాలిన విధానాలే కారణమని కేటీఆర్ మండిపడ్డారు. నాడు రూ.50 లక్షలు పలికిన ఎకరం ధర నేడు 21 లక్షలకు కూడా కొనే దిక్కులేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్‌రెడ్డి మొదట దెబ్బకొట్టింది రాజేంద్రనగర్ నియోజకవర్గాన్నేనని చెప్పారు. ‘2023 క్యాబినెట్ భేటీలో 400 కిలోమీటర్ల మెట్రో మంజూరు చేశాం. ఎయిర్‌పోర్టు మెట్రోకు టెండర్లు పూర్తి చేస్తే కేవలం పనులు ప్రారంభం కావాల్సి ఉన్నది. రేవంత్‌రెడ్డి వచ్చాక రద్దు చేశారు. నాకు భూముల ఉన్నాయనే అనుమానంతో ఇలా చేశారు. రాజేంద్రనగర్‌లో భూములున్నాయని సబితా ఇంద్రారెడ్డిపై ఆరోపణలు చేశారు. భూములు చూపితే రాసిస్తానని సబిత చెప్తున్నారు. రేవంత్‌రెడ్డీ.. బంపర్ ఆఫర్ ఇస్తు న్నా. భూములు ఎకడున్నాయో చూపాలి. కంపెనీలు, భవనాలు నావే అని చెప్తూ రెండేండ్లుగా గాలిస్తున్నారు. గత దీపావళికి మంత్రి బాంబులేటి బాంబులు పేలతాయని చెప్పారు. మళ్లీ దీపావళి వచ్చింది. ఇప్పుడు వారింట్లోనే, మంత్రివర్గంలోనే బాంబులు పేలుతున్నాయి. మా హయాంలో పారిశ్రామికవేత్తలు గొడుగులు పట్టి పెట్టుబడులను ఆహ్వానిస్తే నేటి కాంగ్రెస్ సర్కారు కాంగ్రెస్ నేతలు తుపాకులు పెట్టి బెదిరించి కమీషన్లు దండుకుంటున్నారు’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎంపీలు రాజీనామా చేయాలి
కాంగ్రెస్ పార్టీ బలహీనవర్గాలను పూర్తిగా మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. ఎలాంటి హోంవర్ లేకుండా రిజర్వేషన్లు ఇస్తున్నట్టు నాటకం ఆడితే కాంగ్రెస్ పార్టీ మోసాన్ని కోర్టు ఎండగట్టిందని గుర్తుచేశారు. నిజంగానే బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే 16 మంది ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల బీసీ బంద్‌కు కాంగ్రెస్, బీజేపీలు మద్దతు ఇచ్చాయి. అందరూ శ్రీవైష్ణవులే కానీ, రొయ్యల బుట్టమాయమయిందట. అందరూ మద్దతు చెప్తే బిల్లు ఎందుకు పాస్ కాదు. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ బిల్లు పాస్‌కాదా? పార్లమెంట్ కదలదా? మోదీ ప్రభుత్వం షేక్ కాదా? అసలే మోదీ ప్రభుత్వానికి మెజార్టీలేదు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే మోదీ వణకరా? 8 మంది కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేస్తే రాహుల్‌గాంధీ ఎందుకు చేస్తున్నారని అడగరా? బిల్లు పెడతాం అని పిలువరా? ఎందుకు మోసం చేస్తున్నట్టు? చేయాల్సింది పార్లమెంట్లో కానీ, ఇక్కడ రోడ్లపై డ్రామాలు చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ మద్దతు ఇస్తయట. కానీ, పార్లమెంట్లో మాట్లాడవట. ఎక్కడ మాట్లాలో అక్కడ మాట్లాడరు. ఇక్కడ డ్రామాలు చేస్తూ మరోసారి బీసీలను మోసం చేస్తున్నారు’ అని మండిపడ్డారు.
ఎవరి బెండు తీయాలో తెలుసు
కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావ్సాలిందేనని, తెలంగాణ మళ్లీ పట్టాలు ఎకాల్సిందేనని కేటీఆర్ చెప్పారు. ఇంతకు ముందు లెక ఉండదని, అందరి లెకలు తేలుస్తామని హెచ్చరించారు. ‘మరో రెండేండ్లలో మన ప్రభుత్వం వస్తుంది. ఎవరి బెండు తీయాలో, ఎవరెవరి సంగతి చూడాలో అన్ని చూస్తా. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ సంగతి తెలుసు. ఫహీం సంగతీ తెలుసు. అందరి జాతకాలు తెలుసు. ప్రకాశ్‌గౌడ్ ఎవరి అభివృద్ధి కోసం పోయాడో తెలుసు. అన్నీ బయటకు వస్తాయి. సుల్తాన్‌ఫూర్ బయటకు వస్తుంది. ఘన్సిమియాగూడ బయటకు వస్తుంది. అన్నీ బయటకు వస్తాయి’ అని చెప్పారు. నవంబర్ 11న జరిగే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పాలన, శాంతిభద్రతలు, ప్రభుత్వ విశ్వసనీయతకు పరీక్షగా నిలుస్తుందని చెప్పారు. రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పెద్ద ప్రాజెక్టులను నిలిపివేస్తూ, ప్రజలపై బుల్డోజర్లను ప్రయోగించిందని మండిపడ్డారు. ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ పనితీరుకి పరీక్షగా నిలుస్తాయని అన్నారు.
రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో బుల్డోజర్ రాజ్ వచ్చిందని, పరిపాలనపరమైన సంపూర్ణ వైఫల్యం తెలంగాణలో కొనసాగుతున్నదని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్య పరిపాలన అని అన్నారు. ప్రజలకు పనికి వచ్చే ఒక కార్యక్రమం చేపట్టకుండా కేవలం ప్రచారం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే బుద్ధి వస్తుందని అన్నారు. ప్రజలు ఓటు వేసే ముందు రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును, 420 హామీల అమలులో చేసిన మోసాన్ని గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
జూబ్లీహిల్స్‌లో ఓడిస్తేనే కాంగ్రెస్‌కు సోయి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్‌వే, మెట్రో రెందో దశ ప్రణాళికలను పూర్తిగా పకన పెట్టి, హైదరాబాద్ నగర అభివృద్ధిపైన నీళ్లు చల్లారని కేటీఆర్ విమర్శించారు. ప్రజా రవాణాను బలోపేతం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన ప్రభుత్వం, ప్రజలు ఉన్న ప్రాంతాలను పకనపెట్టి, భవిష్యత్తు లేని ఫ్యూచర్ సిటీ వైపు అడ్డగోలు సొమ్మును ఖర్చు పెట్టేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం ఫ్యూచర్ సిటీలో ఉన్న తమ భూములకు మరింత రేటు వచ్చేలా ప్రజల సొమ్ముతో వేరే కార్యక్రమాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇలా అన్ని రంగాల్లో ప్రజల జీవితాల్లో దుర్మార్గమైన ప్రతికూల ప్రభావాన్ని చూపించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నదని కేటీఆర్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మొదటి దిద్దుబాటు చర్య కావాలని విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుంటేనే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న సోయి వస్తుందని, ఒకటి రెండు హామీలనైనా నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తుందని చెప్పారు. ఒకవేళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, ప్రస్తుతం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నీంటినీ రద్దు చేస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, పార్టీ నాయకులు కార్తీక్‌రెడ్డి, రావుల శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన మైనారిటీ నేత చాంద్
బంజారాహిల్స్, అక్టోబర్ 19: రహ్మత్‌నగర్ డివిజన్ శ్రీరాంనగర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి, సోషల్ మీడియా కార్యకర్త చాంద్‌తో పాటు సుమారు 200 మంది అనుచరులు బీఆర్ఎస్లో చేరారు. మాజీ కార్పొరేటర్ ఎంఏ షఫీ నాయకత్వంలో వీరంతా ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, బీఆర్ఎస్ పార్టీతోనే ప్రజలకు మేలు జరుగుతుందనే నమ్మకంతో పార్టీలో చేరినట్టు చాంద్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ గెలుపు కోసం కృషి చేయాలని కేటీఆర్ వారికి సూచించారు.
పర్సెంటేజీల కోసం కొట్లాట
కాంగ్రెస్ నేతలు పాలన గాలికి వదిలేసి పర్సెంటేజీల కోసం కొట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. తాజాగా క్యాబినెట్ మంత్రుల మధ్యన నెలకొన్న వివాదాలు, వై రుధ్యాలకు కమీషన్లు, వాటాల్లో వచ్చిన తేడా లే కారణమని చెప్పారు. మంచిరేవుల వద్ద ఉన్న భూమి కోసమే సురేఖకు, పొంగులేటి మధ్య గొడవ మొదలైందని ఆరోపించారు. కేవలం మేడారం జాతర పనుల వివాదాల గురించే కాకుండా టెండర్లు మొదలు బిల్లుల విడుదల వరకు ప్రతి సందర్భంలోనూ కమీషన్ల కోసమే మంత్రులు కొట్లాడుతున్నార న్నారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆ మం త్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ స్పందించకుండా దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కోసం పనిచేయాల్సిన క్యాబినెట్ సమావేశంలో కమీషన్ల కోసం మంత్రులు కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్మును దోచుకుంటూ, వాటాల కోసం మంత్రులు కొట్లాడుతుంటే తెలంగాణ పరిపాలన ఎవరు చేస్తారని, పట్టించుకుంటారని కేటీఆర్ ప్రశ్నించారు.
రాష్ర్టానికి పట్టిన శని పోవాలంటే జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ను గెలిపించాలి: సబితా ఇంద్రారెడ్డి
రాష్ట్రానికి పట్టిన శని, దరిద్రం పోవాలంటే ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగిరితేనే సమస్యలు అన్ని పరిషారం అవుతాయని చెప్పారు. ప్రజలు ప్రతి సందర్భంలో కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. దేవుడిని పోగొట్టుకొని దెయ్యాని తెచ్చుకున్నామని ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్‌లో ఎగిరేది గులాబీ జెండానే: బండారు లక్ష్మారెడ్డి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎగిరేది గులాబీ జెండాయేనని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తంచేశారు. జూబ్లీహిల్స్‌లో అందరూ బీఆర్ఎస్ గెలవాలని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రచారంలో ఏ ఇంటికి వెళ్లినా కేసీఆర్ పాలనను గుర్తు చేస్తున్నారని పేర్కొన్నారు. మైనార్టీల అండ బీఆర్ఎస్కే ఉన్నదని చెప్పారు. హైడ్రాను తీసుకొచ్చి నగర ప్రజల బతుకులను రేవంత్‌రెడ్డి సర్కారు బజారుపాలు చేసిందని దుమ్మెత్తి పోస్తున్నారని చెప్పారు.
ఎయిర్‌పోర్టు మెట్రో ఎందుకు రద్దుచేశారు?: కార్తీక్‌రెడ్డి
ఎయిర్పోర్ట్ మెట్రోను ఎందుకు రద్దు చేశారో సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ఎందుకు పార్టీ మారారంటే ప్రజలకు ఏం చెప్తారని నిలదీశారు. ఎయిర్పోర్ట్ మెట్రో కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, వచ్చిన నెల రోజుల్లోనే కేటీఆర్‌తో ఎయిర్‌పోర్టు మెట్రో శంకుస్థాపన చేయిస్తానని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభు త్వం వచ్చిన తర్వాత 111 జీవో నుంచి కూడా విముక్తి కల్పిస్తామని చెప్పారు.
‘సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు చెరువు బఫర్‌లో ఉన్నది. పట్నం మహేందర్‌రెడ్డ్డి గెస్ట్‌హౌస్ చెరువులో ఉన్నా పట్టించుకోరు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ ఇండ్లు చెరువులోనే ఉన్నా హైడ్రా టచ్ చేయదు. కేవీపీ రామచంద్రరావు ఇంటి జోలికి కూడా వెళ్లరు. పెద్దల ఇండ్ల వద్దకు వెళ్లడానికి హైడ్రాకు దారి దొరకదు. పేదల ఇండ్లు కూలిస్తే అడిగేవారు ఉండరని వారిపైకి వస్తున్నారు.
-కేటీఆర్
రేవంత్‌రెడ్డీ.. బంపర్ ఆఫర్ ఇస్తున్నా. భూములు ఎకడున్నాయో చూపాలి. కంపెనీలు, భవనాలు నావే అని చెప్తూ రెండేండ్లుగా గాలిస్తున్నారు. గత దీపావళికి మంత్రి బాంబులేటి బాంబులు పేలతాయని చెప్పారు. మళ్లీ దీపావళి వచ్చింది. ఇప్పుడు వారింట్లోనే, మంత్రివర్గంలోనే బాంబులు పేలుతున్నాయి.
-కేటీఆర్
8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ బిల్లు పాస్‌కాదా? పార్లమెంట్ కదలదా? మోదీ ప్రభుత్వం షేక్ కాదా? 8 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే మోదీ వణకరా? 8 మంది కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేస్తే రాహుల్‌గాంధీ ఎందుకు చేస్తున్నారని అడగరా? బిల్లు పెడతాం అని పిలువరా? బీసీ బిల్లుపై ఎందుకు మోసం చేస్తున్నట్టు? -కేటీఆర్