హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ): కొన్ని టీవీ చానళ్లలో పథకం ప్రకారం కథనాలు, థంబ్ నెయిల్స్ ప్రసారం చేస్తూ తెలంగాణ అస్థిత్వంపై దాడికి తెగబడుతున్నారని సీనియర్ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో మీడియా పరిణామాలు-పర్యవసానాలు’ అనే అం శంపై ప్రముఖ జర్నలిస్టు శివారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ.. ‘మహా న్యూస్’ చానల్ తీరుపై మండిపడ్డారు. తెలంగాణ అస్థిత్వం కోసం పోరాడిన రాజకీయ నాయకులను నెగటివ్ కోణంలో చూపడం, వ్యక్తిత్వ హననానికి దిగడం మంచి పద్ధతి కాదని స్పష్టం చేశారు. తెలంగాణ నాయకత్వం విషయంలో మీడియా బాధ్యతగా వ్యవహరించాలని, పత్రికా స్వేచ్ఛను సరైన రీతిలో ఉపయోగించుకోవాలని సూచించారు. మీడియా స్వీయ నియత్రణ పాటించాలని తీర్మానించారు. ‘మహా న్యూస్’ చానల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై వేధింపులను ఆపాలని పోలీసులను కోరారు.
తెలంగాణ వచ్చి పదేండ్లు దాటినందున ఇకపై ‘తెలంగాణ’ అనే పదాన్ని వాడొద్దని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి పేర్కొనడంతో.. ఆ పదం లేకపోతే మనకు అస్థిత్వం ఎక్కడిదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే ‘మహా న్యూస్’ వ్యక్తిత్వ హననానికి పాల్పడిందని, ఫోన్ల ట్యాపింగ్ కేసు విచారణలో ఇంకా ఏమీ తేలకపోయినప్పటికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై వ్యక్తిగత దాడి చేయటం వెనుక చంద్రబాబు కుట్ర ఉన్నదని సీనియర్ జర్నలిస్టు శైలేశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి సాగర్, సీనియర్ జర్నలిస్టులు యోగి, నర్రా విజయ్, వైఎన్ఆర్, రాజకీయ విశ్లేషకుడు ప్రసాద్, ‘మహా న్యూస్’ చానల్ ప్రతినిధి అజిత తదితరులు
పాల్గొన్నారు.