మూడురోజుల తర్వాత జమీర్ మృతదేహం లభ్యం
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి కొప్పుల, ఎమ్మెల్సీ కవిత
కంటతడి పెట్టిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
రాయికల్ రూరల్/జగిత్యాల కలెక్టరేట్, జూలై 15: వరద ఉధృతికి వాగులో గల్లంతైన ఎన్టీవీ విలేకరి ఘటన విషాదాంతమైంది. మూడురోజుల తర్వాత శుక్రవారం ఉదయం జమీర్ మృతదేహాన్ని వాగులోని కిలోమీటరు దూరంలో గుర్తించారు. జగిత్యాల జిల్లాకేంద్రానికి చెందిన జమీర్ ఎన్టీవీ జిల్లా రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ నెల 12న తన స్నేహితుడు ఇర్షాద్‌తో కలిసి రాయికల్ మండలం రామోజీపేట్, భూపతిపూర్ మధ్యగల బోర్నపల్లి కుర్రువాగులో చిక్కుకొన్న కౌలు రైతుల వార్త కవరేజీ కోసం కారులో వెళ్లారు. వరద ఉధృతికి కారుతో సహా గల్లంతయ్యారు. ఇర్షాద్ ప్రాణాలతో బయటపడ్డాడు.
అప్పటి నుంచి జమీర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున కారు వాగులో 50 మీటర్ల దూరంలో దొరికింది. కాగా వాగులో కిలోమీటరు దూరంలో బండచెరువు వద్ద వేపచెట్టు కొమ్మల మధ్య జమీర్ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహానికి అక్కడే పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. జమీర్‌కు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. జమీర్ మృతదేహాన్ని చూసి ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కంటతడిపెట్టారు. కాగా జమీర్ మృతి పట్ల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.
సంతాపం తెలిపిన ఎమ్మెల్సీ కవిత
జర్నలిస్ట్ జమీర్ మృతిపట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంతాపం ప్రకటించారు. అతడి కుటుంబానికి అండగా నిలుస్తామని ట్విట్టర్ ద్వారా హామీ ఇచ్చారు. వార్తా సేకరణకు ప్రాధాన్యత ఇస్తూనే వర్షాలు, వరదల పట్ల అప్రమత్తంగా ఉంటూ మీడియా మిత్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.