Congress | హైదరాబాద్, మే 12(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల జోష్ తగ్గిందా? ఫలితాలపై నమ్మకం సడలిందా? మొన్నటి వరకు తిరుగులేదనుకున్న నేతలకు ఇప్పుడు తత్వం బోధపడిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలోని కాంగ్రెస్‌కు, ప్రస్తుత కాంగ్రెస్‌కు పొంతన లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఎన్నికల్లో జోష్‌తో పనిచేసిన నేతలు, కార్యకర్తలు పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం డీలా పడ్డారని చెప్తున్నారు. కాంగ్రెస్ వెనకబడడమే ఇందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని మొక్కుబడిగా నిర్వహించారని, కార్యకర్తలు కూడా మనస్ఫూర్తిగా పనిచేయలేదని సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి, బేల వ్యాఖ్యలు కార్యకర్తల మనోబలాన్ని దెబ్బతీశారన్న చర్చ జరుగుతున్నది. రేవంత్రెడ్డిలోనూ గతంలోని ఉత్సాహం ఇప్పుడు కనిపిచంలేదని గుర్తుచేస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా భావించిన రేవంత్‌రెడ్డి అపనమ్మకంతోనే అక్కడికి అరడజనుసార్లు పర్యటించి ప్రచారం చేశారని పేర్కొంటున్నారు. ప్రతి సభలోనూ దేవుడిపై ఒట్లు వేయడం, వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించడం వంటి సానుభూతి మాటలు సొంత నేతలు, కార్యకర్తల్లో గెలుపుపై అపనమ్మకాన్ని పెంచాయని చెప్తున్నారు.
కాంగ్రెస్‌లో కేసీఆర్ బస్సుయాత్ర కల్లోలం
అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లను గెలుచుకొని అత్తెసరు మెజార్టీతో బయటపడిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తమకు తిరుగులేదని, ప్రజలంతా తమవైపే ఉన్నారనే భ్రమలో పడిపోయింది. అందులో ఉండగానే ఐదు నెలల కాలం గడిచిపోయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్యక్షేత్రంలోకి దిగగానే కాంగ్రెస్ బేలతనం బయటపడింది. కేసీఆర్ బస్సుయాత్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈ యాత్రతో కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ఊపుతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ గెలవచ్చని భావించిన రేవంత్‌రెడ్డి అండ్ కో ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారు. బస్సుయాత్ర చేసిన కేసీఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా ఉద్యమ నేతకు నీరాజనాలు పలికారు. బీఆర్ఎస్, కేసీఆర్ పని ఖతమైందని సంతోషపడిన కాంగ్రెస్‌కు బస్సుయాత్రలో కేసీఆర్‌కు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ చూసి చూసి దిమ్మతిరిగింది. అప్పటి వరకు పార్లమెంట్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అని భావించిన కాంగ్రెస్ నేతలకు తత్వం బోధపడింది. పడిలేచిన కెరటంలా కేసీఆర్ మళ్లీ తన మార్క్ రాజకీయంతో తిరిగి వచ్చారు.
హామీలే కొంప ముంచుతాయా?
అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు కాంగ్రెస్ ఇచ్చిన అలవిగాని హామీలే ఇప్పుడు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ 13 హామీలు ఇచ్చింది. వీటన్నింటినీ 100 రోజుల్లోనే అమలు చేస్తామని ప్రకటించి నాలుగింటిని మాత్రమే అమలుచేసింది. మహిళలు, రైతులు, వృద్ధుల్లో వ్యతిరేకతకు ఇది కారణమైందని చెప్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందిలేని నాలుగు హామీలను అమలు చేసి, ఆర్థికంగా భారమయ్యే హామీలను పక్కనపెట్టిన కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా వరికి రూ. 500 బోనస్, రూ. 2 లక్షల రైతు రుణమాఫీ, మహిళలకు రూ. 2500 వంటివి అమలు చేయకపోవడంతో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.