వరంగల్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఓరుగల్లు కాంగ్రెస్‌లో గ్రూపుల లొల్లి ముదురుతున్నది. వరంగల్ ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వ ర్గాలుగా ఏర్పడి ఆధిపత్య పోరుకు దిగడం స్థా నికంగా చర్చనీయాంశమైంది. మొదట్లో అంతర్గతంగా ఉన్న గ్రూపు రాజకీయాలు ఏడాది క్రితమే బహిర్గతమయ్యాయి. సమ్మక్క-సారలమ్మ జాతర, ధార్మిక భవన్, పోలీసు పోస్టింగులు, మాజీ రౌడీషీటర్‌కు ప్రాధాన్యం, నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశాల్లో మంత్రి సురేఖ కు, మెజారిటీ ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. తాజాగా మంత్రి కొండా సురేఖ భర్త మురళీధర్‌రావు.. గురువారం చేసిన వ్యాఖ్యలు మరింత కాకరేపాయి. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య లక్ష్యంగా ఆయన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో హనుమకొండలో ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఇంట్లో ఎమ్మెల్యేలు కడియం, రేవూరి, గండ్ర సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మంత్రి వ్యవహారశైలి, మురళీధర్‌రావు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొండా మురళీధర్‌రావు వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య ఫిర్యాదు చేశారు. సురే ఖ, మురళి వ్యవహారశైలిపై మిగిలిన ఎమ్మెల్యే లు ఇప్పటికే వీడియోలు, ఫొటోలను పీసీసీ చీఫ్‌కు పంపించారు. మహేశ్‌కుమార్‌గౌడ్‌ను రెండుమూడు రోజుల్లో స్వయంగా కలిసి మరోసారి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఉ మ్మడి వరంగల్‌కు చెందిన 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఎక్కువ సెగ్మెంట్లలో కొండా దంపతులు జోక్యం చేసుకొని గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని గత అక్టోబర్‌లోనూ పలువురు ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. సమన్వయం పాటించాలని రెండు వర్గాలకు అప్పట్లో అధిష్ఠానం సూచించినా ఆ ప్రభావం ఏమీ లేకుండాపోయింది.
కాంగ్రెస్ సర్కారు ఏర్పడినప్పటి నుంచే ఓరుగల్లులో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. ఉమ్మడి వరంగల్ నుంచి కొండా సు రేఖ, సీతక్క మంత్రులుగా ఉన్నారు. మొదట్లో వీరిద్దరి నేతృత్వంలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి గెలిచిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రూనాయక్ మొదటి నుంచి మంత్రి సీతక్కతో ఉం టూ వస్తున్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, భూక్యా మురళీనాయక్ మంత్రి కొండా సురేఖ వెంట ఉన్నారు. తొలినుంచీ కాంగ్రెస్‌లో ఉన్న నర్సంపేట ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి రెండు గ్రూపులకు దూరంగా ఉంటూ వచ్చారు.
2024లో మేడారం జాతరకు ముందు మంత్రులు సురేఖ, సీతక్కకు మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. జాతర ప్రదేశం సీతక్క ని యోజకవర్గమైన ములుగులో ఉన్నది. జాతర నిర్వహించే దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ ఉన్నారు. జాతర అభివృద్ధి ప నులు, ఏర్పాట్లపై ఇద్దరు మంత్రుల మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత దేవాదాయ శాఖ పరిధిలోని వరంగల్ ధార్మిక భవన్లో మేడారం జాతర ఈవో ఆఫీసు కేటాయింపు వ్యవహారం విభేదాలకు మరింత ఆజ్యం పోసింది. ఇక పలు నియోజకవర్గాల్లో మంత్రి సురేఖ జోక్యం చేసుకోవడం ఎమ్మెల్యేల ఆగ్రహానికి కారణమైంది. బీసీ కార్డునే అడ్డంపెట్టుకొని ఇతర ప్రజాప్రతినిధులపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆ పార్టీ నాయకుడు కొండా మురళీధర్‌రావును హెచ్చరించారు. ఏ సమస్య ఉన్నా పార్టీలో అంతర్గతంగా చర్చించాలని, ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్పారు. పార్టీలో ఆధిపత్య పోరుతపై పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ స్పందించారు. రెండు వర్గాల నుంచి ఫి ర్యాదులు అందాయని పేర్కొన్నారు. పార్టీ పరిశీలకుల నివేదిక మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.