సంగారెడ్డి : కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలి అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. పటాన్చెరు నియోజకవర్గం బొల్లారంకు చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎండీ ఆరిఫ్ తో పాటు మరో 25 మంది సభ్యులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాలరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరార. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..ప్రస్తుత రాజకీయాల్లో ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలంటే సోషల్ మీడియాలో అత్యంత చురుకుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడంలో సోషల్ మీడియానే నేడు కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర యువతను తీవ్రంగా దగా చేసింది. ఎన్నికలకు ముందు అమలుకాని హామీలిచ్చి గద్దెనెక్కి, అధికారంలోకి వచ్చాక నిలువునా ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ లేదు, కొత్తగా ఉద్యోగాల కల్పన లేదు. వారు చెప్పిన రెండు లక్షల ఉద్యోగాల హామీ పూర్తిగా బోగస్ అని తేలిపోయింది. యువతతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం వంచించిందని మండిపడ్డారు. అవ్వాతాతలకు పెన్షన్లు పెంచకుండా, కోటి మంది మహిళలకు నెలకు రూ. 2500 ఇవ్వకుండా, రైతన్నలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ప్రతి వర్గాన్ని దారుణంగా మోసం చేసింది. ఈ ప్రభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మీలాంటి యువత ముందుకొచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలి. కాంగ్రెస్ చేస్తున్న ప్రతి మోసాన్ని సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజలందరికీ తెలిసేలా చేయాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. కార్యక్రమంలో పటాన్చెరు పార్టీ ఇన్ఛార్జి ఆదర్శ్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.