స్టేషన్ ఘన్పూర్ సెప్టెంబర్ 07 : తెలంగాణలో ఔర్ ఏక్ దక్కా, మూడోసారి కేసీఆర్ సీయం కావడం పక్కా అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. గురువారం జనగామ జిల్లా స్టేషన్ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్టేషన్ ఘన్పూర్ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తొమ్మిదేళ్లుగా జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను అనుభవిస్తున్న తెలంగాణ ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిని చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నారని ఔర్ ఏక్ దక్కా.. మూడోసారి కేసీఆర్ సీఎం పక్కా అని పేర్కొన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా రైతులకు 24గంటల నాణ్యమైన ఉచిత కరెంటు, రైతుబంధు, దళితబంధు, బీసీబంధు, రైతుబీమా, నేతన్న బీమా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి వంటి పథకాలతో పాటు రైతులను గిట్టుబాటు ధర అందించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఆసరా పెన్షన్లు ఉన్నాయా అని ప్రశ్నించారు.
ఇవన్నీ విజయవంతంగా అమలుచేస్తున్న రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణనే అని పేర్కొన్నారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో నియోజకవర్గ ప్రజలకు అండగా ఉన్నానని నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన ఎజండా అని, అభివృద్ధి చెందిన నియోజకవర్గాల సరసన ఈ స్టేషన్ నిలబెట్టడమే తన తపన అని కడియం అన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో, ఎమ్మెల్యే రాజయ్య, జిల్లా మంత్రులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ సహకారం, ప్రజల ఆశీర్వాదంతో స్టేషన్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానని చెప్పారు. అనంతరం కడియం సమక్షంలో నియోజకవర్గం నుంచి సుమారు 100మంది బీఆర్ఎస్లో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సమావేశంలో జనగామ జడ్పీ చైర్మన్, బీఆర్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.