ఆదిలాబాద్,అక్టోబర్ 11: అరవై ఏండ్లకు పైగా పాలించిన కాంగ్రెస్,బీజేపీ ప్రభుత్వాలే దేశాన్ని సర్వ నాశనం చేశాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని వార్డు నంబర్19 లోని వరలక్ష్మీనగర్కు చెందిన 300 మంది మతీన్ ఆధ్వర్యంలో బుధవారం బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే విదేశాల్లో ఉన్న నల్లడబ్బును జనధన్ ఖాతాల్లోకి రూ.15లక్షలు వేస్తామని ప్రకటించారని, ఒక్కరికైనా వేశారా అంటూ ప్రశ్నించారు. దేశంలో నిత్యవసరాలతో పాటు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి సామాన్యులు అల్లాడుతున్నారని, దీనిపై కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసే ప్రతిపక్ష పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు కొనసాగుతున్నాయని చెప్పారు.