హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది, దేశానికే అదర్శంగా నిలిచిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఆరెకటిక సమాజం ప్రతినిధులు, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నాయకులు మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకతను గుర్తించే వివిధ పార్టీల నుంచి పార్టీలో చేరుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టే బీఆర్ఎస్ వైపు నిలబడాలని పిలుపునిచ్చారు.

మంత్రి హరీశ్‌రావుకు మొక్కను అందజేస్తున్న దృశ్యం
బీఆర్ఎస్ పార్టీలోనే ప్రతి కార్యకర్తకు సముచి గౌరవం దక్కుతుందన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, గుండప్ప, ఉమాకాంత్ పాటిల్, విజయ్ కుమార్, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.