బడంగ్‌పేట, జూన్ 22 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మహేశ్వరం మండలం మన్సాన్పల్లి గ్రామానికి చెందిన మర్యాద రాఘవేందర్రెడ్డితోపాటు వందలాదిమంది కార్యకర్తలు సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. రాఘవేందర్‌రెడ్డి చేరికతో కాంగ్రెస్ పార్టీకి మహేశ్వరం నియోజకవర్గంలో పెద్ద దెబ్బ తగిలినట్టు పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసి కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోతున్నవారు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లతోపాటు అన్ని ప్రభుత్వ పథకాలు అందజేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ ఎన్నికల కోసమే రైతుభరోసా ఇస్తున్నారని దుయ్యబట్టారు. రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులను ఎందుకు ఎంపిక చేయడంలేదని ప్రశ్నించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 19 మండలాలకు రైతుబంధును రద్దు చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. రాఘవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలిగిస్తున్నాయని, ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజునాయక్, పాండుయాదవ్, వెంకటేశ్వరరెడ్డి, ఎం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.