సూర్యాపేట, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. సూర్యాపేట జిల్లాలో అధికార కాంగ్రెస్‌తోపాటు బీజేపీ నుంచి భారీగా వచ్చి చేరుతున్నారు. కొద్దిరోజులుగా సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ మున్సిపాలిటీల్లో భారీ ఎత్తున చేరికలు జరగ్గా తాజాగా సూర్యాపేట జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు, 17వ వార్డు మాజీ కౌన్సిలర్ కట్కూరి కార్తీక్‌రెడ్డి, 27వ వార్డు మాజీ కౌన్సిలర్ చిరివెళ్ల కాంతమ్మవెంకటేశ్వర్లుతోపాటు 60 మంది కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. వీరందరికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండాయేనని ధీమా వ్యక్తంచేశారు. అలాగే కోదాడ మున్సిపాలిటీలోని 14వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు గోపిదేశి లక్ష్మీముత్తయ్య ఆధ్వర్యంలో సుమారు 30మంది ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరగా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.