హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): తప్పులతడకగా ఉన్న కులగణనపై రీ సర్వే కోరితే తప్పేంటని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జోగు రామన్న ప్రశ్నించారు. గణాంకాలు తప్పని రుజువు చేస్తామని, దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. కులగణన సర్వే తప్పులతడక అని తమ పార్టీ నేతలు ఇప్పటికే గణాంకాలతో సహా నిరూపించారని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో గురువారం మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్గౌడ్తో కలిసి జోగు రామన్న మీడియాతో మాట్లాడారు. ఓ సామాజికవర్గం జనాభా ఎందుకు పెరిగింది? ఒక్క బీసీ జనాభా మాత్రమే ఎందుకు తగ్గింది? అని ప్రశ్నించారు.
కులగణనలో 30 లక్షల వరకు బీసీ జనాభాను తకువ చేసి చూపారని, మళ్లీ సర్వే చేయాల్సిందేనని మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ డిమాండ్ చేశారు. తూతూమంత్రంగా సర్వే చేశారు కాబట్టే, బీసీ కమిషన్ చైర్మన్ కూడా సర్వే రిపోర్టును తప్పుబట్టారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కులగణన పేరుతో ప్రభుత్వం బీసీల హననం జరిపిందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్ మండిపడ్డారు. ‘కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్.. బీసీలను మోసం చేస్తే మీ పార్టీ భూ స్థాపితం కాకతప్పదు’ అని హెచ్చరించారు. దమ్ముంటే బీసీ జనాభాపై, ఎవరి హయాంలో బీసీలకు మేలు జరిగిందో 125 అడుగుల బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చర్చకు రావాలని సవాల్ విసిరారు.
బీసీలకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పక్షాన పోరాడతామని, కాంగ్రెస్ మెడలు వంచుతామని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్ హెచ్చరించారు. కులగణన మొదలు పెట్టినప్పటి నుంచే రేవంత్‌రెడ్డి బీసీలపై కుట్రలు మొదలుపెట్టారని ఆరోపించారు. తక్షణమే కులగణన రిపోర్టుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. బతికుండగానే లెక్కల్లో 40 లక్షల మంది బీసీలను చంపిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని మండిపడ్డారు. కులగణనపై ప్రశంసలు కురింపించేముందు రాహుల్‌గాంధీ వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.