ఆదిలాబాద్, జనవరి 7(నమస్తే తెలంగాణ) : పంటలకు కేంద్రం మద్దతు ధర ప్రకటించినా కొనుగోలు నిబంధనల కారణంగా రైతులు తమ పంటలను అమ్ముకోలేని పరిస్థితులు దాపురించాయని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు వ్యవసాయరంగంపై కనీస అవగాహన లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దనిద్ర వీడాలని, రాష్ట్రంలోని ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మద్దతు ధరలు దక్కేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో చివరి గింజనూ మద్దతు ధరతో కొనుగోలు చేశామని, కరోనా వంటి కష్టకాలంలో రైతుల ఇండ్ల వద్దే కాంటాలు పెట్టామని రామన్న గుర్తుచేశారు. సోయాను కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న వరుస ఆందోళనలకు రైతుల నుంచి మంచి స్పందన వచ్చిందని, రైతుల సమస్యలు పరిష్కారమయ్యే దాకా నిరసనలు కొనసాగిస్తామని ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో రామన్న స్పష్టంచేశారు.
జోగు రామన్న : రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతల సమస్యలను పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు యాప్‌ల పేరిట రైతులను ఇబ్బందులు పెడుతున్నాయి. పంటలు విక్రయించాలన్నా, ఎరువులు కొనుగోలు చేయాలన్నా యాప్‌లు వాడాలంటున్నారు. దుకాణాల్లో లేని మందుబస్తాలకు యాప్‌లు పెట్టి ఏం లాభం?. సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు చేస్తున్నా పలు నిబంధనలు కారణంగా అమ్ముకోలేని పరిస్థితి ఉన్నది. పంటలో తేమ 8శాతం, ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే యాప్ నిర్వహణ సరిగా లేదు. రైతులు ఒకసారి పత్తిని అమ్మితే రెండోసారి అమ్మే పరిస్థితి లేదు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పండించే పత్తి ఆసియాలోనే నాణ్యతతో కూడిన పత్తిగా నిపుణులు గుర్తించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలో రూ.100 తగ్గించి క్వింటాల్‌కు రూ.8010తో కొనుగోలు చేయడం వల్ల రైతులు నష్టపోతున్నారు. దేశంలో రైతులకు నష్టం కలిగించేలా కేంద్రం పత్తి దిగుమతులపై 11శాతం సుంకం ఎత్తివేసింది.
జోగు రామన్న : కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల రైతులు రెండేండ్ల నుంచి నష్టపోతున్నారు. రైతుభరోసా ఎకరాకు రూ.15వేలు ఇస్తామని, రూ.12 వేలే ఇస్తున్నారు. ఇప్పటికే రెండు కిస్తీలు ఎగ్గొట్టారు. రూ.2 లక్షల రుణమాఫీ అని ప్రకటించి ఎగనామం పెట్టారు. కౌలు రైతుల సాయం ఊసే లేదు. రైతు కూలీలకు సాయం మరచారు. పత్తి, సోయాబీన్, మక్క ఇతర పంటల అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది. పంటలు కొనుగోలు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి కేంద్రానికి లేఖలు రాశామని అంటున్నారు. అఖిలపక్ష నాయకులతో కలిసి కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదు. ఆర్భాటాల కోసం కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో రూ.130 కోట్ల పంటల కొనుగోళ్లపై ఎందుకు మాట్లాడడం లేదు.
జోగు రామన్న : బీఆర్ఎస్ పదేండ్ల పాలన రైతులకు స్వర్ణయుగం అని చెప్పవచ్చు. కేసీఆర్ హయాంలో రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచారు. రైతుబంధు పథకాన్ని కాపీ చేసిన కేంద్రం కిసాన్ సమ్మాన్ యోజన అమలు చేస్తున్నది. ఏడాదిలో వానకాలం, యాసంగి పంటలకు ముందుగానే రైతుబంధు డబ్బులు ఖాతాల్లో పడేవి. కేంద్రం మద్దతు ధరతో పంటలు కొనుగోలు చేయకపోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం పంటలు సేకరించింది. కరోనా సమయంలో రైతుల ఇండ్ల వద్ద కాంటాలు పెట్టి కొనుగోలు చేశాం. ఆదిలాబాద్ వంటి జిల్లాలో జొన్నలను ప్రభుత్వ మద్దతు ధరతో సేకరించి రైతులను ఆదుకున్నది. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల సాయం అందించాం. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లాలో పంటల కొనుగోళ్ల విషయంలో చేపట్టిన ఆందోళనలకు రైతులు భారీగా సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలుగా ఉన్న రైతులు తమ ఆందోళనల్లో పాల్గొన్నారు.
జోగు రామన్న : నా 37 ఏండ్ల రాజకీయ జీవితంలో రెండేండ్లుగా రైతులు పడుతున్న ఇబ్బందులు ఎప్పుడూ చూడలేదు. మద్దతు ధర లభించక ఆర్థిక ఇబ్బందులతో ఆదిలాబాద్ జిల్లాలోనే 29మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు. నిరుడు ఆగస్టులో వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎకరానికి రూ.10 వేల సాయం ఇస్తామని చెప్పినా, ఇప్పటికీ సాయం అందలేదు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుకు సోయాను కొనుగోలు చేయాలని రైతులతో కలిసి వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదు. ఈ నెల 2 నుంచి 6 వరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశాం. సోయాబీన్ కొనుగోళ్లు జరగకపోతే, ఇతర సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళనలు కొనసాగిస్తాం. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను అడ్డుకుంటాం. కాంగ్రెస్, బీజేపీ నాయకులు గ్రామాల్లో తిరుగకుండా ప్రజల్లో చైతన్యం తెస్తాం.