ఆదిలాబాద్, జనవరి 5(నమస్తే తెలంగాణ) : రంగు మారిన సోయాను కొనుగోలు చేయాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు తరలివచ్చారు. అనంతరం రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ రాజర్షిషాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కోటా అయిపోయిందనే సాకుతో జిల్లాలోని రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోలు చేయడంలేదని ఆరోపించారు. కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామా లు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పంటలను కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. కార్పొరేట్ కంపెనీలకు చెందిన బడాబాబుల బాకీలు రూ.12 లక్షల కోట్లను ఏకకాలంలో మాఫీ చేసిన ప్రభుత్వం రైతులకు సంబంధించిన రూ.133 కోట్ల విలువైన పంటను కొనడంలో మాత్రం జాప్యం చేస్తున్నదని మండిపడ్డారు. బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో రైతు సమస్యలపై వాయిదా తీర్మానం ఎందుకు కోరడంలేదని ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లాలో 29 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం విచారకరమని వాపోయారు. రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.