శేరిలింగంపల్లి, నవంబర్ 17: గోపన్‌పల్లి స్థలాల విషయంలో ఉద్యోగులకు న్యాయం జరిగేవరకు పోరాటం అపేదిలేదని ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధమని టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. గోపన్‌పల్లిలో భాగ్యనగర్ టీఎన్జీవోల నిరసనదీక్షలు 125 రోజుకు చేరిన తరుణంలో సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జగదీశ్వర్ మాట్లాడుతూ గతంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు టీఎన్జీవోలు, ఏపీఎన్జీవోలు, సెక్రటేరియట్ ఉద్యోగులకు 600ల ఎకరాలను ఇచ్చారని తెలిపారు. అందులో కొన్ని సోసైటీల అధ్వర్యంలో ఉద్యోగులు భవనాలు కట్టుకున్నారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో చిన్న కోర్టు వివాదం నేపథ్యంలో ఏపీఎన్జీవోలు, బీటీఎన్జీవోలు ఇండ్ల నిర్మాణం పూర్తిచేయలేదని అన్నారు. దీంతో తెలంగాణ వచ్చాక అప్పటి ప్రభుత్వం ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుందని తెలిపారు. తాజాగా వినాయక వెల్ఫేర్ సోసైటీ పేరుతో కొందరు 17 ఎకరాలు భూమిని ఆక్రమించుకున్నారని చెప్పారు. చిన్న ఉద్యోగులతో కూడిన బీటీఎన్జీవోస్కు చెందిన స్థలాలను ప్రభుత్వం వెంటనే స్పందించి తిరిగి ఇవ్వాలని కోరారు. ఇప్పటికే 125 రోజులుగా ఉద్యోగులు నిరసన దీక్షలు చేపట్టినా ప్రభుత్వం స్పందించడం లేదని, ఇక ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని అన్నారు.
‘మా భూములు మాకు తిరిగి కేటాయించేవరకు నిరసనలు ఆపేదిలేదు, ప్రాణత్యాగానికైనా సిద్ధం’ అని భాగ్యనగర్ టీఎన్జీవోస్ సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణగౌడ్ స్పష్టంచేశారు. రాత్రికి రాత్రి గూండాలు వచ్చి తమ భూముల్లో సెక్యూరిటీ గార్డులను బెదిరించి ఆ భూముల్లో కంటెయినర్లను ఏర్పాటుచేసి కబ్జా చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో సర్వేచేసిన రెవెన్యూ అధికారులు ఇక్కడ ప్రైవేట్ స్థలాలు లేవని తేల్చిచెప్పినప్పటికీ నేడు అవే భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం జీవో ఇచ్చి తమకు స్థలాలు కేటాయించేవరకు ఇక్కడినుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు. తెలంగాణలోని 33 జిల్లాలకు చెందిన అధ్యక్షులు, కార్యదర్శులు, భాగ్యనగర్ టీఎన్జీవోస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సోసైటీ ఉపాద్యక్షుడు రాజేశ్వర్‌రావు, సెక్రటరీ మల్లారెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, డైరక్టర్లు ప్రభాకర్‌రెడ్డి, రషీదా బేగం, సంధ్యారాణి, నర్సింహరాజు, ఏక్నాథ్గౌడ్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బీటీఎన్జీవోలు 125 రోజులుగా శాంతియుతంగా నిరసన దీక్షలు చేపట్టి న్యాయంకోసం పోరాడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని టీఎన్జీవోస్ కేంద్ర సంఘం ప్రధానకార్యదర్శి ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం సవతితల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నదని ఆరోపించారు. బీటీఎన్జీవోస్కు చెందిన స్థలాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ముఖ్యమంత్రి అన్నప్పుడు తాము సహకరించామని, అండగా నిలిచామని నేడు ప్రభుత్వం బీటీఎన్జీవోల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.