Police Jobs | హైదరాబాద్ : పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు తక్షణమే 20 వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీస్ ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. TGLPRB బోర్డుకి ఇప్పటికే వినతిపత్రం కూడా సమర్పించడం జరిగిందని నిరుద్యోగులు తెలిపారు. మంత్రులందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చామన్నారు. అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదన్నారు.
ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ ఏటా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి, నిరుద్యోగులను ఆదుకుంటామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఆ తర్వాత నిరుద్యోగులను నమ్మించి గొంతు కోసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలల వుతున్నా ఒక్క పోలీస్ ఉద్యోగం భర్తీ చేయలేదని విమర్శించారు. నోటిఫికేషన్లో వయోపరిమితిని 35 ఏండ్లకు పెంచాలని కోరారు. అలాగే జీవో నంబర్ 46ను పూర్తిగా రద్దుచేసి, లాంగ్ జంప్ను 3.8 మీటర్లకు తగ్గించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల లోపు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని జేఏసీ ప్రతినిధులు ఆకాశ్, శంకర్, వంశీ, నవీన్ పట్నాయక్, శింబునాయక్, సందీప్, చెర్రీ ప్రవీణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.