హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ‘తక్షణమే పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ జారీచేయాలి. 20 వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయాలి. లేకుంటే కాంగ్రెస్ సర్కార్కు తగిన బుద్ధి చెప్తాం’ అని పోలీస్ ఉద్యోగార్థుల నిరుద్యోగ జేఏసీ నేతలు హెచ్చరించారు పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లో ఖాళీల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలని జేఏసీ ప్రతినిధులు గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకుని ఓట్లు వేసినందుకు తమను నమ్మించి గొంతు కోయొద్దని హితవు పలికారు.
పోలీస్ ఉద్యోగాల భర్తీ విషయమై ఇప్పటికే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుతోపాటు మంత్రులకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పలుమార్లు వినతిపత్రాలను ఇచ్చామని, ఆయనా ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలవుతున్నా ఒక పోలీస్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లోపు నోటిఫికేషన్ ఇవ్వకపోతే, వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని, కాంగ్రెస్కు వ్యతిరేకంగా చేస్తామని హెచ్చరించారు.