హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ నియామకాల కోసం రూపొందించిన జాబ్ క్యాలెండర్‌కు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. శుక్రవారం అసెంబ్లీలో ఈ వివరాలను ప్రకటించనున్నది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు వివరించారు. జాబ్ క్యాలెండర్‌పై అసెంబ్లీలో చర్చించి చట్టబద్ధత కల్పిస్తామన్నారు. ప్రతిపక్ష నేతలు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి అయినా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పారు.
నిరుద్యోగులే ఉద్యోగ నోటిఫికేషన్లు వాయిదా వేయాలని కోరుతున్నారని చెప్పారు. జీవో 317, జీవో 46, 2008 డీఎస్సీ బాధితులకు ఉద్యోగాలు కల్పించే అంశంపై సబ్ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా అధికారులతో చర్చలు జరిపిందన్నారు. కచ్చితంగా వాటిని పూర్తి చేస్తామన్నారు. కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వీటికి సంబంధించిన విదివిధానాల రూపకల్పన కోసం ముగ్గురు మంత్రులతో కూడిన క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కమిటీలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఉంటారని వెల్లడించారు. ఈ కమిటీ నెలలోపే నివేదిక ఇస్తుందని చెప్పారు. ధరణిపై నియమించిన కమిటీ నివేదిక ఇచ్చిందని, శుక్రవారం అసెంబ్లీలో ఈ అంశంపై స్వల్పకాలిక చర్చ ఉంటుందని తెలిపారు. హుస్నాబాద్ కాలువలకు సంబంధించి రూ.437 కోట్ల బడ్జెట్ ఆమోదించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, క్యాబినెట్ మంత్రులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. రాబోయే సీజన్‌లోపు గౌరవెళ్లి ద్వారా నీరు అందిస్తామని చెప్పారు. పంచాయతీ రాజ్ ఎన్నికలకు సంబంధించి రెండుమూడు రోజుల్లో ఓటరు జాబితా విడుదల చేస్తారని, అనంతరం బీసీ కులగణన చేస్తామని పేర్కొన్నారు.
క్యాబినెట్ నిర్ణయాలు