 
                                                            హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలలో ‘పరిశోధన కేంద్రాల’ (రీసెర్చ్ సెంటర్) ఏర్పాటు కోసం యాజమాన్యాలు, విద్యార్థి సంఘాలు చేసిన ఒత్తిడికి జేఎన్టీయూ దిగివచ్చింది. వాటి ఏర్పాటు కోసం తనిఖీలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నది. సంబంధించిన ఫైలుపై ఆ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ కిషన్కుమార్రెడ్డి ఇటీవల సంతకం చేశారు. ఈ విషయం ఆయనే వెల్లడించారు.
పరిశోధన కేంద్రాల ఏర్పాటు లేదా రెన్యువల్ కోసం నిరుడు యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేయగా, పలు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నాయి. వర్సిటీ అధికారులు దాదాపు 100కు పైగా దరఖాస్తులు స్వీకరించారు. ఫైనల్గా 56 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు అర్హత సాధించినట్టు వెల్లడించారు. అనంతరం జరగాల్సిన తనిఖీల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ఈ విషయంపై జేఎన్టీయూ వీసీ, అధికారులు స్పందించడం లేదు. కారణాలు వెల్లడించడం లేదు.
దీంతో యూనివర్సిటీ అధికారుల తీరుపై కాలేజీలతోపాటు విద్యార్థి సంఘాలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. పరిశోధన కేంద్రాల ఏర్పాటు కోసం ప్రాథమిక ప్రక్రియ పూర్తి చేసి దాదాపు ఏడాది పూర్తయిందని, తుది అనుమతులు ఇవ్వడానికి ఇంకెన్ని రోజులు తీసుకుంటారోనని మండిపడుతున్నాయి. వీలైనంత త్వరగా తనిఖీలు పూర్తి చేసి, తుది అనుమతులు ఇవ్వాలని జేఎన్టీయూను డిమాండ్ చేస్తున్నాయి. ఈ సెంటర్లను ఏర్పాటు చేస్తే.. తమకు పీహెచ్డీలో సీట్లు లభించే అవకాశాలు అధికంగా ఉంటాయని విద్యార్థులు పేర్కొంటున్నారు.
 
                            