సిద్దిపేట కమాన్, ఫిబ్రవరి 26 : సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లిలో ముత్యాల పోచమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో గురువారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో ఎన్సాన్పల్లికి మహర్దశ పట్టిందన్నారు. గ్రామ చెరువు ఎండాకాలంలో మత్తడి దుంకుతుందంటే కేసీఆర్ తెచ్చిన కాళేశ్వరం నీళ్లతోనే అన్నారు.
కేసీఆర్ తెచ్చిన కాళేశ్వరం నీళ్లతో నేడు కాలంతో పనిలేకుండా రెండు పంటలు పండుతున్నాయని తెలిపారు. నేడు ఎన్సాన్పల్లి పట్టణంగా రూపురేఖలు సంతరించుకుందని, వైద్య కళాశాల, వెయ్యి పడకల దవాఖాన, కేంద్రీయ విద్యాలయం, సబ్ జైల్ ఇలా అన్ని ఎన్సాన్‌పల్లిలో ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. మెడికల్ కళాశాల ఎకడ ఉందంటే ఎన్సాన్‌పల్లిలో అనేంత అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు.
గంగమ్మ గుడి, పోచమ్మ గుడి, పెద్దమ్మ గుడి, శివాలయం, కొత్తగా రామాలయం నిర్మించుకుంటున్నామని తెలిపారు. గుడి,బడి ఇలా అన్ని పనులు చేసుకొని గ్రామాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపినట్లు తెలిపారు. సిద్దిపేట నుంచి ఫోర్ లైన్ రోడ్డు లైట్స్‌తో అద్భుతంగా చేసుకున్నామని హరీశ్‌రావు తెలిపారు.