సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 26: సంగారెడ్డి జిల్లాకేంద్రంలోని తారా ప్రభుత్వ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఈనెల 27న నిర్వహించనున్న వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య కోరారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్లోని తన చాంబర్ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో మొదటి సారిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనే యువత రాష్ట్ర స్థాయిలోనూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘50 ఇయర్స్ ఆఫ్ ఎమెర్జెన్సీ-లెసెన్స్ ఫర్ ఇండియన్ డెమోక్రసీ’ అనే అంశంపై ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో 18- 25 ఏండ్ల వయస్సున్న యువ త ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ్య వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.