చంద్రబాబు సెల్‌ఫోన్, కాల్ రికార్డులు, వాయిస్ ఫోరెన్సిక్ రిపోర్ట్, పట్టుబడిన రూ.50 లక్షల నగదు, ఆ డబ్బును ఎవరు సమకూర్చారనే అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలి. ఓటుకు నోటు కేసు నమోదైనప్పుడు నేను దొరక్కుండా ఉండేందుకు రేవంత్, చంద్రబాబు, లోకేశ్, ఆయన పీఏ కలిసి నన్ను కిడ్నాప్ చేయించారు. ఆరేడు నెలలు అజ్ఞాతంలో ఉంచారు. -మత్తయ్య
ఖైరతాబాద్, సెప్టెంబర్ 24: ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాత్ర కూడా ఉన్నదని ఆలిండియా దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య కార్యదర్శి జెరూసలేం మత్తయ్య ఆరోపించారు. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న మత్తయ్య బుధవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో తన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. తుది తీర్పు ప్రకటించే ముందు ధర్మాసనం మరోసారి కేసుకు సంబంధించి పూర్తి వివరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, ఈ నేరాన్ని ప్రోత్సహించిన చంద్రబాబునాయుడు, అతడి కుమారుడు లోకేశ్, టీడీపీ నాయకులు, గత ఏపీ ప్రభుత్వంలో పనిచేసిన పోలీసులు అధికారులపై కూడా కేసులు పెట్టాలని, సమగ్రంగా విచారించి శిక్షించాలని కోరారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నంరేందర్‌రెడ్డి, అధికార ప్రతినిధులుగా ఉన్న వేం కీర్తన్‌రెడ్డి, ఉదయ్‌సింహాను పదవి నుంచి తప్పించాలని కోరారు. విచారణ ముగిసే వరకు పదవులకు దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రభుత్వాన్ని కూలదోయడం కోసం తనతో డబ్బులు ఆశ చూపించి కుట్రచేసిన చంద్రబాబు శిక్షార్హుడని పేర్కొన్నారు. ప్రస్తుతం చంద్రబాబు కనుసన్నల్లోనే రేవంత్‌రెడ్డి నడుస్తున్నారని, ఈ కేసులో తన స్టేట్మెంట్ ఎంతో కీలకమని, కానీ పిచ్చోడిగా తనపై ముద్రవేసి కేసు కొట్టేయించేందుకు పథకం పన్నుతున్నారని ఆరోపించారు.
మరోసారి దర్యాప్తు చేయాలి
కేసును తిరిగి దర్యాప్తు చేయాలని, ఈ కేసు నుంచి తనకు విముక్తి కల్పించాలని, అసలైన దోషులను శిక్షించాలని మత్తయ్య కోరారు. చంద్రబాబు సెల్‌ఫోన్, కాల్ రికార్డులు, వాయిస్ ఫోరెన్సిక్ రిపోర్ట్, పట్టుబడిన రూ.50 లక్షల నగదు, ఆ డబ్బును ఎవరు సమకూర్చారనే అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని కోరారు. ఓటుకు నోటు కేసు నమోదైనప్పుడు తెలంగాణ పోలీసులు, ఏసీబీ అధికారులకు తాను దొరక్కుండా ఉండేందుకు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు, లోకేశ్, ఆయన పీఏ కలిసి తనను కిడ్నాప్ చేయించారని ఆరోపించారు. ఆరేడు నెలలు అజ్ఞాతంలో ఉంచారని తెలిపారు. లోకేశ్, కిలారి రాజేశ్, రేవంత్‌రెడ్డి అనుచరుడు జిమ్మీబాబు తనను విజయవాడలోని రహస్య ప్రాంతానికి తరలించారని చెప్పారు. అప్పటి ఏపీ ఇంటలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వర్రావు, డీజీపీ, టాస్క్‌ఫోర్స్ బృందాలు, ఇతర ఎమ్మెల్యేలు, క్యాబినెట్ మంత్రులంతా ఈ కుట్రలో భాగమని ఆరోపించారు. వీరందరినీ కేసులో నిందితులుగా చేర్చాలని డిమాండ్ చేశారు.
తనపై ఒత్తిడి తెచ్చి కేసీఆర్, కేటీఆర్‌పై విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదు చేయించారని పేర్కొన్నారు. స్టీఫెన్సన్ను వ్యక్తిగతంగా కలిశానని బలవంతంగా స్టేట్మెంట్ రాయించారని తెలిపారు. తెల్లపేపర్లపై సంతకాలు తీసుకుని, భార్యకు నామినేటెడ్ పదవి, పిల్లల చదువుకు సాయమని చెప్పి కోర్టులో 164 పిటిషన్ వేశారని వివరించారు. ఈ వ్యవహారంలో టీడీపీ న్యాయవాదులు కనకమేడల, దమ్మాలపాటి, అప్పటి అడ్వకేట్ జనరల్ పాత్రపై కూడా విచారణ జరిపించాలని కోరారు. కేసును విచారించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి శివశంకర్‌ను కూడా నిందితుడిగా చేర్చాలని, కేసులో ఉన్న సాక్ష్యాధారాలను పూర్తిగా పరిశీలించకుండా, ఇన్ కెమెరా విచారణల ద్వారా న్యాయాన్ని తప్పుదారి పట్టించారని ఆరోపించారు. శివశంకర్ పదవీ విరమణ చేసిన తర్వాత ఆయనను తెలంగాణ పోలీస్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్‌గా నియమించారని చెప్పారు.
వివరాలన్నీ కోర్టులో వెల్లడిస్తా
కేసులో సాక్షిగా ఉన్న తనను అప్రూవర్‌గా గుర్తించాలని, కోర్టుకు కేసు వివరాలు వెల్లడించేందుకు సిద్ధమని మత్తయ్య చెప్పారు. ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసినా, సుప్రీంకోర్టులో తన వాదన చెప్పే అవకాశం దొరకలేదని పేర్కొన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని, పూర్తి వివరాలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ ద్వారా విన్నవించినట్టు తెలిపారు. ఆయన పర్యవేక్షణలో విచారణ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరానట్టు పేర్కొన్నారు. లేదంటే ఏపీ, తెలంగాణలో కాకుండా ఢిల్లీ హైకోర్టులోనైనా విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.